31, డిసెంబర్ 2009, గురువారం

కొత్త సంవత్సరానికి స్వాగతం

మల్లె పూల సౌరభానికీ, మామిడిపళ్ళ మాధుర్యానికి వెరసి నా గుండెలో నిండిన జీవ రస రాగ వాహినికి ,

ఈ సంవత్సరానికిది మొదటి వుత్తరం. నిజం చెప్పాలంటే గత సంవత్సరానికి చివరి వుత్తరం కూడా . అందుకే ఇది ఒక రకంగా భరత వాక్యం మరో రకంగా నాందీ ప్రస్తావన . ఈ కొత్త సంవత్సరం ఇలా మొదటి అక్షరం నీకే రాయడం మరీ మరీ బావుంది. మా ఇంటి ముందు (సారీ రూం అనాలేమో ) మా ఇంటి ఓనరు, పక్క వాళ్ళు ముందు వాళ్ళు కలసి అందమైన రంగవల్లిక తీర్చి దిద్దుతున్నారు. పక్కన పెట్టిన టీవీలోంచి జానకి రాముడు మంద్రంగా వినిపిస్తోంది. ఇంటి ముందు చేమంతి ఇంకాసేపట్లో విచ్చుకోవడానికి సిద్దంగా వుంది. సూర్యోదయం జరగడాన్ని, పువ్వు విచ్చుకోవడాన్ని దగ్గరుండి చూడాలని నాకో వింత కోరిక. ఎంత తెల్లవారుజామున లేచి, కళ్ళు విప్పార్చుకుని చూసినా మనకు తెలియకుండానే మనం చూస్తూ ఉండగానే సూర్యోదయం జరిగి పోతుంది. అలాగే పువ్వు విచ్చుకోవడం కూడా.

అలాగే జీవితం లో చాలా సంఘటనలకు మనం నిరపేక్షమైన సాక్ష్యాలుగా మిగిలి పోతాము. . మన ప్రమేయము, ప్రభావమూ, లేకుండా ఎన్నో సంఘటనలు జరిగిపోతాయి. ఆ సంఘటనల మంచి చెడుల ప్రభావము మన జీవితాలమీద ఎన్నో రకాలుగా వుంటుంది.

గదిలోనూ, మదిలోనూ ఒక్కడినే. ఎవరు ఆలోచనామాత్రంగా కూడా లేరు. ఈ కేవల ఎకాంతంలోంచి నీకు వుత్తరం రాయడం నిజంగా బావుంది. బయట అంతా కురుస్తున్న మంచు. రంగవల్లికల మధ్య తరుణీ సంరంభం. దూరంగా హాప్పీ న్యూ ఇయర్ అంటూ వేస్తున్న కేకలు చాలా బలహీనంగా వినిపిస్తున్నాయి. ఇడియట్ పెట్టెల నిండా వింత వింత విన్యాసాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతున్న చప్పుడు.

నిజంగా మనం కొత్త సంవత్సరాన్ని ఇలాగేనా స్వాగతించడం? కొన్ని సినిమా పాటల ఆధారంగా ఏదో ఒక ప్రోగ్రాము సమర్పించడము... యాంకర్లతో గొంతులు పగిలి పోయేలా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరిపించడము.. ఏ సినిమా వాళ్ళతోనో సంభాషణ నడిపించడము. మన జీవితంలో అతి ముఖ్యమైన టీవీ ల పని అయిపోయింది. యువత మొత్తం బార్ల లోను పబ్ లలోను ఒంటిగంట రెండు గంటల వరకు తాగడము ఆ తర్వాత రెండు చక్రాల బండ్ల మీద నగరం అంత తిరుగుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తిరగడము ఆనవాయితీగా మారి పోయింది. మన శుభాకాంక్షలను ఇతరులతో పంచుకోవడానికి ఇంత బుర్ర తక్కువ హంగామా జరగాల్సిందేనా?


ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున దేశ ప్రజలందరూ ఇరవై నాలుగు గంటల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమే చెప్పాలని అందువల్ల ఒక్క రోజు అయినా నిజాయితీగా వుండే అవకాశము దేశానికి ఇవ్వాలని ఏ రాజకీయ నాయకుడు పిలుపు ఇవ్వడు ఎందుకని? సత్యం చెప్పడంలో వున్న ఆనందం మందు తాగి చిందులు వెయ్యడంలో ఉంటుందా?


ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు అయినా ప్రతి మనిషి ఆకలితో వున్న మరో మనిషికి కడుపు నిండా అన్నం పెట్టాలని, ఆ రకంగా రంతిదేవుదుని , డొక్కా సీతమ్మని, స్మరించుకుంటూ స్వాగతం చెప్పమని ఏ సామాజిక కార్యకర్తా పిలుపు ఇవ్వడు ఎందుకని? ఆకలితో వున్న మనిషికి అన్నం పెట్టడంలో వున్న ఆనందం కంటే సినిమా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందం గొప్పదా?

ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు అయినా గవర్నమెంట్ కార్యాలయాలన్నీ ఉదయం పది గంటలకల్లా తెరవాలని, వుద్యోగాస్తులంతా వొళ్ళు వంచి పని చేయాలని, అందరిని సామరస్యంగా పలకరించాలని, క్రమ శిక్షణా రాహిత్యము ఎక్కడా ఉండకూడదని Being a Human Be Human అని... ఈ ఒక్క రోజు అయినా అధికార్లు హద్దు దాటరాదని, రాజకీయ నాయకులు కుట్రలు, కుతంత్రాలు మానెయ్యాలని... ఎవరికీ వారు నిజాయితీగా వుండాలని, నిష్కల్మషంగా వుండాలని, పొరుగువాడికి ఎంతో కొంత సహాయం చెయ్యాలని... ఈ ఒక్క రోజు అయినా మనుషులు.. మనుషులుగా వుండాలని ఎవరూ ప్రామిస్ చెయ్యమని అడగరు ఎందుకని?


మనుషులు మనుషులుగా ప్రవర్తించడమే కాలానికి మనుషులు అందించగలిగే గొప్ప స్వాగతం కాదా?
అప్పుడిక శివమణి డ్రమ్సు , హరిహరన్ గీతము ..... రామోజీ కార్నివాలు
ఇవన్నీ ఎందుకు?


నీ
వంశీ

(వంశీ కృష్ణ కొత్త పుస్తకం విదేహ లోని ఒక వుత్తరం)

ఈ పుస్తకం గురించిన సమాచారం కోసం
జూలూరు గౌరీ శంకర్
జర్నలిస్ట్, సంపాదకుడు
౧-౮-౭౦౨/౩౩/౨౦అ౧౧
పద్మా కాలని
నల్లకుంట
హైదరాబాద్
వారిని సంప్రదించాలి.

5 కామెంట్‌లు: