2, నవంబర్ 2020, సోమవారం

విస్మయ పరచే టోఫీ మాస్టర్

 విస్మయ పరచే టోఫీ మాస్టర్

" Life is simple and the man continues to complicate it by waving the still water "
అంటాడు యాసుజిరో ఓజో . అవును ! జీవితం చాలా సరళంగానూ , సుందరంగానూ , సున్నితంగానూ ఉంటుంది . మనిషి దాన్ని తన వైవిధ్యభరితమైన భావజాలాల తోనూ , సమాజాన్ని , రాజ్యాన్ని , జీవితంలోకి చొరబడటానికి అప్రయత్నంగా అనుమతించడం ద్వారాను సంక్లిష్టం చేస్తాడు . ఇలా సంక్లిష్టం చేయడం నిరంతరం జరిగే ఒక విషాద చర్య . ఓజో స్టిల్ వాటర్ అని అన్నాడు కానీ నిజానికి అది బాయిల్డ్ వాటర్ . ఎక్కడో ఒకచోట సరళ రేఖ లాంటి జీవితానికి మనిషి ఒక చిన్న మలుపును ఇస్తాడు . ఇంక ఆ మలుపు కాస్తా వందలు , వేలు , లక్షలుగా మారి తన సరళత్వాన్ని కోల్పోతుంది . జీవన సూత్రానికి ఎక్కడో ఒక చోట మనిషి ఒక చిన్న ముడి వేస్తాడు . ఆ తరువాత సూత్రం తన చేతిలోనుండి జారి ముడుల మీద ముడులు పడి చిక్కుబడి పోయి విడతీయలేనంత సంక్లిష్టంగా మారిపోతుంది .
జననం సరళం . మరణమూ సరళమే . నడుమ జీవనమే సంక్లిష్టం . ఈ సంక్లిష్టతే మరణాన్ని కూడా సంక్లిష్టంగా మారుస్తుంది . మనిషిని తనను తనకు కాకుండా చేస్తుంది . తన జీవితం తన చేతిలోనే వుంది అని మనిషి అనుకుంటాడు కానీ ఎవరో రాసిన స్క్రిప్ట్ కి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది . మనిషి ఏక కాలం లో పాత్రధారీ , సూత్రధారీ , ప్రేక్షకుడు కావడమే జీవితం లో ఉన్న అద్భుతమైన విశేషణం . తన జీవితానికి తానే కర్త , కర్మ , క్రియ అని అనుకుంటాడు కానీ తను కేవలం కర్మ మాత్రమే . క్రియ చేయించేవాడు ఎక్కడో ఉంటాడు . ఆ క్రియాశీలి ఒక్కొక్కసారి రాజ్యం అవుతుంది . మరొక్క సారి సమాజం అవుతుంది . చాలాసార్లు అప్రయత్నంగా ఇతరేతర శక్తులను అనుమతించడం ద్వారా మనిషే అవుతాడు
ఈ సంక్లిష్టతను సరళంగా , సున్నితంగా , హృదయాస్పదంగా ఆవిష్కరించడమే ఓజు చేసిన పని . ఎవరీ ఓజు? జపాన్ పేరు చెప్పగానే సినిమా ప్రియులకు గుర్తువచ్చే మొదటి రెండు పేర్లలో ఒకటి య్యసుజిరో ఓజు . మొదటిది కురుసోవా . నిజానికి కురసోవాకీ , ఓజు కి మధ్య పోటీ లేదు . ఇద్దరూ అసమాన ప్రతిభావంతులే . రెండవపేరు అని ఎందుకు అన్నాను అంటే యాసుజిరో ఓజో పేరులోని జిరో అంటే జపాన్ భాషలో సెకండ్ అని అర్ధం అట . అందుకే నేను రెండవ పేరు అన్నాను
రెండవ ప్రపంచ యుద్ధానంతర జపాన్ సామాజిక వ్యవస్థ లో చోటుచేసుకున్న అతి సూక్ష్మాతి సూక్ష్మమయిన మార్పులకు కూడా తన సినిమాల ద్వారా దృశ్యరూపాన్ని ఇచ్చి వాటికి శాశ్వత త్వాన్ని ఇచ్చినవాడు ఓజు . సినిమా వ్యాకరణాన్ని ధిక్కరించి , తిరగరాసి , అసలు సినిమాకు ఒక ప్రామాణిక వ్యాకరణమే లేదు . కవిత తన రూపాన్ని తానె ఎనుకున్నట్టు సినిమా తన వ్యాకరణాన్ని తానె ఎన్నుకుంటుంది అని చెప్పినవాడు ఓజు . కవిత్వం ఒక ఆల్కెమీ . దాని రహస్యం నన్నయ్య కి తెలుసు , కృష్ణ శాస్త్రి కి తెలుసు , శ్రీశ్రీ కి తెలుసు అని తెలుగు కవి అనుకున్నట్టుగానే ఓజు కూడా " I can make fried tofu , boiled tofu, stuffed tofu. cutlets and other fancy stuff that is for other directors" అన్నాడు . అసలు tofu రహస్యం ఓజు కి మాత్రమే తెలుసు. టోఫు అంటే సోయా పాల తో తయారు చేసే మన పాల కోవా లాంటి తియ్యటి పదార్ధం . బాయిల్డ్ టొఫు , స్టఫ్ఫ్డ్ టొఫు అనడంలో నే ఓజు చమత్కారం మనకు అర్ధం అవుతుంది
జపాన్ మూకీల నుండి టాకీల దాకా ఓజు చేసిన ప్రయాణం చిన్నదేమీ కాదు . దానికి అదే ఒక అద్భుతం . అయితే పాశ్చాత్య సినిమా ప్రపంచానికి అతడి గురించి తెలిసింది చాలా తక్కువ . కురుసోవా రషోమన్ సృష్టించిన ప్రభంజనం తో జపాన్ సినిమా పై దృష్టి ఎక్కువ కావడం తో ఓజు సినిమాలు జపాన్ నుండి ఇతర దేశాలకు ఎగుమతి కావడం మొదలు పెట్టాయి .
ఒక్కసారి జపాన్ ఎల్లలు దాటాక ఓజు సినిమాలు మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు . ప్రపంచమంతా వీర విహారం చేయడం మొదలుపెట్టాయి . ప్రతి తరాన్నీ తమ అసమాన ప్రతిభతో మంత్రముగ్ధులను చేయడం మొదలు పెట్టాయి . ఓజు టోక్యో స్టోరీ ప్రపంచ వ్యాపితంగా వచ్చిన వంద అద్భుతమైన సినిమాల లిస్ట్ లో మూడవ స్థానం ఆక్రమించింది . టోక్యో స్టోరీ ఓజు నోరికా ట్రయాలజీ లో మూడవ సినిమా . మొదటి సినిమా లేట్ స్ప్రింగ్ . రెండవ సినిమా ఎర్లీ సమ్మర్ . ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఓజు అబ్సెషన్ సృష్టించాయి . అతడి యాన్ ఆటమ్ ఆఫ్టర్ నూన్ కూడా చాలా అద్భుతమైన సినిమానే
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఒక అజేయ శక్తిగా జపాన్ ఎదగడం లో జపాన్ పొందిన , పోగొట్టుకున్న సామాజిక సున్నితత్వాన్ని ఓజు సినిమాలు పట్టుకున్నంతగా మరొకరి సినిమాలు పట్టుకోలేదు . భౌతిక ప్రపంచం లో అభివృద్ధి , సాంప్రదాయ , సాంస్కృతిక , మానసిక ప్రపంచం లో పోగొట్టుకున్న ఆత్మిక శక్తి ఓజు సినిమాలకు ప్రాణం . (Development and loss of Japaneese traditions)అతడిని కలవరపరచినంతగా మరొక దర్శకుడిని కలవరపరచ లేదు . మన తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పినట్టు ఒక కవి తన జీవితమంతా ఒకే కవిత రాస్తాడు అనే మాట నిజమే అయితే ఓజు కూడా తన జీవితమంతా ఒకే సినిమా తీశాడు వేరు వేరు రూపాలలో . జీవితం లో దుఃఖం ఒక్కటే . దాని రూపాలు అనేకం అనుకుంటే ఓజు సినిమాల సారాంశం ఒక్కటే కానీ ఆ సారాంశాన్ని వ్యక్తం చేసిన తీరు మాత్రం శత సహస్ర ముఖం . ఒక చిత్రకారుడు ఒక బొమ్మను గీసి చెరిపేసి , చెరిపేసి గీసి , తన శరీరాన్ని ఆత్మను దహించుకున్నట్టు , ఒక కవి ఒక ప్రతీకను కవితలో ఉంచాలా? వద్దా ? అని తపన పడినట్టు ఓజు తనను తాను దహించుకున్నాడు .
లేట్ స్ప్రింగ్ లోనూ . ఎర్లీ సమ్మర్ లోనూ ఒకటే కథ .కథ లో పెళ్లి ఒక ప్రతీక . దాని చుట్టూతా ఆవరించుకుని ఉండే ప్రచ్ఛాయ , ఉపచ్ఛాయ ల అధ్యయనం ఒక వాస్తవం . ఆ అధ్యయన సారాంశం సామాజిక వాస్తవికత , వయక్తిక స్వేచ్ఛల మధ్యన ఘర్షణ . మారుతున్న సామాజిక ముఖ చిత్రానికి అద్దుతున్న రంగుల నీడ . ఆ రంగుల నీడ చాటున కనిపించని విషాద జీర . కన్నీటి చార . అదొక డ్రమెటిక్ మోనోలాగ్ . భాషలో వివరించలేని , హృదయానికి తప్ప అనుభవంలోకి రాని కన్నీటి నీడ . కన్నీడ
లేట్ స్ప్రింగ్ భార్యను కోల్పోయిన ఒక మధ్య వయసు ప్రొఫెసర్ , అతడి పెళ్లి కాని కూతురు మధ్య నడచిన చిన్న కథ . కాజో హిరతోషు రాసిన తండ్రీ , కూతురు అన్న కథ ఆధారంగా ఓజు తీసిన ఈ సినిమాలో షుకూచి ఒక అధ్యాపకుడు . ఇరవై నాలుగేళ్ళ నోరికా అతడి కూతురు . అతడికి ఆమె . ఆమెకి అతడు . తండ్రికి కావలసిన సౌకర్యాలు అన్నీ ఆమె సమకూర్చి పెడుతూ ఉంటుంది . ఆమె అవసరాలు అన్నీ తండ్రి చూస్తూ ఉంటాడు . ఏ దిగుళ్ళు లేకుండా జీవితం సాఫీగా సాగుతున్న దశలో నోరికా మేనత్త ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది . " పిల్ల కి ఇరవై నాలుగేళ్లకు వచ్చాయి ఇంకా పెళ్లి చేయవా ? " అని పోరు పెడుతుంది షుకూచి తో . అప్పటిదాకా నోరికా కు పెళ్లి చేయాలన్న ఆలోచన షుకూచి కి అస్సలు లేదు . ఆ తలపు అతడికి వూహ లో కూడా రాలేదు . నోరికా కి కూడా అంతే . ఆమె హృదయం లో , ఆలోచన లో పెళ్లి ఆమె మాట ఎప్పుడూ వినపడలేదు . మేనత్త పెళ్లి ఊసు ఎత్తేసరికి ఏదో ఒక కొత్త పదం కొత్తగా విన్నట్టుగా అనిపిస్తుంది . ఒక కొత్త భాషలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది
తాను పెళ్లి చేసుకుని వెళిపోతే తండ్రిని ఎవరు పట్టించుకుంటారు అన్నది నోరికా బెంగ . పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కొత్త ప్రపంచం లో నోరికా ఎలా తట్టుకుంటుంది అన్నది తండ్రి ఆలోచన . మేనత్త చెప్తూనే ఉంటుంది కానీ మొదట్లో అంత సీరియస్ గా తీసుకోడు షుకూచి . కానీ మేనత్త సణుగుడు , నసుగుడు ఎక్కువ అయ్యేసరికి నోరికా పెళ్లి గురించి కాస్త మనసు పెడతాడు . అక్క సలహా మీద తనదగ్గరే పనిచేస్తున్న, నోరికా చనువుగా వుండే హాటోరి గురించి అభిప్రాయమేమిటని కూతురును అడుగుతాడు . ఆమె నవ్వి హాటోరీ కి అప్పటికే నిశ్చితార్ధం అయిందని చెపుతుంది . టోక్యో యూనివర్సిటీ నుండి డిగ్రీ తీసుకున్న , గ్యారీ కూపర్ లా వుండే మరొక అబ్బాయిని నోరికా కోసం చూస్తారు . అయితే నోరికా నిర్ద్వందంగా ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది . తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏమిటని అత్తను ప్రశ్నిస్తుంది . అప్పుడు మేనత్త నోరికా కి ఒక రహస్యం చెపుతుంది
షుకూచి కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అని నోరికకి తెలిసిన మీవా తో అతడు ప్రేమ లో ఉన్నాడని చెపుతుంది . మీవా ని కలుసుకోమని చెపుతుంది . మేనత్త బలవంతం మీద గ్యారీ కూపర్ ను కలుసుకుంటుంది . చిత్రంగా మొదటి చూపులోనే గ్యారీ కూపర్ ఆమెను ఇంప్రెస్ చేస్తాడు
పెళ్ళికి ముందే షుకూచి మిత్రుడిని కలుసుకోవడానికి క్యోటో కి వెళతారు షుకూచి నోరికా . తన తండ్రి లాగే భార్యను కోల్పోయిన ఓనోడెరా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసినప్పుడు నోరికా ఏర్పరచుకున్న అభిప్రాయాలు అన్నీ ఓనెడోరా రెండవ భార్యను చూసాక చెల్లాచెదురు అయిపోతాయి నోరికాకీ . అప్పుడు ఆమెలో మరొక కొత్త ఆలోచన వస్తుంది . తన తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నా అందరూ కలసి ఉండవచ్చును కదా అని
అప్పుడు షుకూచి ఒక మాట చెప్తాడు " It is the Order of Human life and History" అని . ఒక కొత్త ప్రపంచం లోకి వెళుతున్నప్పుడు ఆనందమో , సంతోషమో వెంటనే దొరకదని కాస్త ఓపిక పట్టాలని చెప్తాడు .. శీతాఫలం ఆరమగ్గితే ఎంత మధురంగా ఉంటుందో జీవితం కూడా అలా ఆర ,ఆర మగ్గాలి అని చెప్తాడు . నోరికా పెళ్ళిచేసుకుని ఒక కొత్త భాష లోకి వెళ్ళిపోతుంది
ఆ తరువాత తండ్రి షుకూచి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది నిజం కాదని తనని పెళ్ళికి ఒప్పించడానికి ఆడిన ఒక చిన్న నాటకం అని తెలుస్తుంది . ఆమె కంటి చివర ఒక చిన్న నీటి చుక్క
వాళ్లిద్దరూ తండ్రీ కూతుళ్లే . ఒకరు కణ్వ మహర్షి . మరొకరు శకుంతల . పోలిక ఆ తండ్రీ కూతుళ్ళ వరకే . ఈ అతిపెద్ద విశ్వం లో మనిషి జీవితం అతి చిన్న లిప్త . ఆ లిప్తపాటు జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి తండ్రీ కూతుళ్లు ఇద్దరూ ఒకరి కోసం మరొకరు శాక్రిఫైస్ చేయడానికి సిద్దపడటం హృదయాన్ని కదిలిస్తుంది . ఏ ప్రేమలో స్వచ్ఛత , సుందరత , ఉంటుందో అక్కడ శివం కూడా ఉంటుంది . శివమ్ అంటే కూల్చడం మాత్రమే కాదు . నిర్మించడం కూడా
ఓజు పెళ్లిని చాలా సందర్భాలలో మృత్యువు తో పోలుస్తాడు . పెళ్లి తరువాత మనుషులు పూర్తిగా మారిపోతారు అనడానికి మృత్యువును ఒక ప్రతీకగా తీసుకుంటాడు . ఈ లేట్ స్ప్రింగ్ లో కూడా పెళ్లి కావడానికి ముందు గదిలో నుండి అందరూ వెళ్ళిపోయాక ఒక ఖాళీ అద్దాన్ని చూపిస్తాడు . అందులో నోరికా ఒక ప్రతిబింబంగా కూడా కనిపించదు . నోరికా గ్యారీ కూపర్ భార్యగా మిగులుతుంది తప్పిస్తే నోరికగా చనిపోయిందని ప్రేక్షకుడికి చెప్తాడు వున్న చిన్న ప్రతీక ద్వారా . నిజానికి ప్రతీ స్త్రీ పెళ్లి కాగానే చనిపోతుంది . నిజం నిష్టూరంగా వున్నా సరే
"Ozu connects marriage and death in obvious and subtle ways in most of his late films… The comparison between weddings and funerals is not merely a clever device on Ozu’s part, but is so fundamental a concept in Japanese culture that these ceremonies as well as those surrounding births have built-in similarities… The elegiac melancholy Ozu evokes at the end of Late Spring, Late Autumn, and An Autumn Afternoon arises only partly because the parents have been left alone… The sadness arises because the marriage of the younger generation inevitably reflects on the mortality of the older generation." Robin Wood stresses the marriage-death connection in commenting on the scene that takes
ఇది ఒక సినిమా విమర్శకుడు Geist, Kathe (1992). "Narrative Strategies in Ozu's Late Films". అన్న పుస్తకం లో అన్నమాట . ఓజు సినిమాలు చూడటం మంచి అనుభవం .
వచ్చేవారం అతడి మరొక సినిమా గురించి

(నవ తెలంగాణ సోపతి నుండి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి