2, నవంబర్ 2020, సోమవారం

విషాద నీలిమ మేఘ్ డాకా తారా

 విషాద నీలిమ మేఘ్ డాకా తారా

" Tagore once said - art has to be beautiful, but, before that, it has to be truthful. Now, what is truth? There is no eternal truth. Every artist has to learn private truth though a painful private process. And that is what he has to convey."
" ఈ సత్యం ఎక్కడినుండి ఎలా వస్తుంది అంటే కళాకారుడి దృక్పధం లో నుండి , కళాకారుడి అంతర్మథనం , అంతర్ ధ్యానం లో నుండి సత్యం తన రూపాన్ని వెతుక్కుంటుంది. సత్యం సాపేక్షం గా ఉండి క్షణ క్షణం మార్పులకు లోనయ్యే ఈ విశ్వం లాంటిది కనుక ప్రతి ఒక్కళ్ళూ తమదైన సత్యాన్ని తమ జీవితపు సుదీర్ఘమైన , లోతైన అనుభవాలలో నుంచి , ఆలోచనలలో నుంచి అన్వేషించాలి . కళ అంత అల్పమైన విషయమేమీ కాదు " అని సత్య స్వరూపానికి తనదయిన అర్ధాన్ని ఇచ్చాడు రిత్విక్ ఘటక్ .
Film-making is not an esoteric thing to me. I consider film-making – to start with – a personal thing. If a person does not have a vision of his own, he cannot create. అని కూడా రిత్విక్ అంటాడు . జీవితం పట్ల గొప్ప మోహము , సానుకూల దృక్పధము ఉంటే కానీ రిత్విక్ ను అనుభూతించలేము .
ఎవరీ రిత్విక్ ఘటక్
సత్యజిత్ రే అనే ఒక బెంగాలీ మహా వట వృక్షం మాటున పొందవలసినంత గుర్తింపు పొందని గొప్ప దర్శకుడు రిత్విక్ ఘటక్ . తన 27 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎనిమిది సినిమాలు , పది డాక్యుమెంటరీలు మాత్రమే సృష్టించినప్పటికీ తన ముద్రను బలంగా ముందు తరాలకు వదిలివెళ్లిన దర్శకుడు .
1947 ఆగస్టు 15 న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయం ఒక కంట ఆనంద బాష్పాలని వొలికిస్తే మరొక కంట విషాదాశ్రువులను కురిపించింది . ఇండియా పాకిస్థాన్ లు గా భారతదేశం విడిపోయినప్పుడు అది కేవలం ఒక భౌగోళిక చీలిక మాత్రమే కాదు . సంస్కృతిలో , చరిత్రలో , సంప్రదాయం లో ఒక చీలిక కూడా . భారతదేశానికి తూర్పు పడమరలుగా వున్న పంజాబ్ బెంగాల్ లోని సామాన్య ప్రజలకు ఇది కొన్నిప్రాంతాలు అటు వైపు , మరికొన్ని ప్రాంతాలు ఇటువైపు బదలాయింపు జరపడం మాత్రమే కాదు . తమ శరీరం కలోని ఒక ముఖ్యమైన భాగాన్ని మరొకరికి అప్పగించడం కూడా . ఆ అప్పగించడం లో ఉన్న అత్యంత అమానవీయ అంశాన్ని బలంగా పట్టించుకున్న వాడు రిత్విక్ ఘటక్ .
సినిమాలలోకి రావడానికి ముందు రిత్విక్ శాంతినికేతన్ లో చదువుకున్నాడు . ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ లో చురుకుగా పాల్గొన్నాడు . రిత్విక్ తాత్విక దృక్పథం మీద ఈ రెండు వ్యవస్థల ప్రభావం చాలా బలంగా వుంది . ఈ ప్రభావాల కారణంగానే రిత్విక్ శరణార్థి అన్న పదం అంటే ఎక్కువ అయిష్టాన్ని కనపరచేవాడు . ఆ అయిష్టాన్ని , కోపాన్ని తన సినిమాల ద్వారా అతడు బలంగా వ్యక్తపరిచాడు . సినిమాను తనకాలపు దర్శకులు చాలా మందికంటే ఎక్కువగా , ప్రతిభావంతంగా ఒక ప్రొటెస్ట్ ఫార్మ్ గా ఉపయోగించుకున్నది ఒక రిత్విక్ మాత్రమే
రిత్విక్ ఘటక్ పేరు చెప్పగానే చాలా మంది సినిమా ప్రియులకు " మేఘ్ డాకా తారా " గుర్తుకువస్తుంది . రిత్విక్ సినిమాలు అన్నిటిలోకి ఎక్కువ పాపులారిటీ పొందినది , ఎక్కువ డబ్బు సంపాదించినది మేఘ్ డాకా తారా. అది తెలుగు లో బాలచందర్ దర్శకత్వం లో అంతులేని కథ గా పునర్నిర్మించబడింది . జయప్రద కథానాయక . ఆ సినిమాలో ఆమెకు నటిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి .
నిజానికి మేఘ్ డాకా తారా ఒక సినిమా కాదు . మేఘ డాకా తారతో కలసి మరో రెండు సినిమాలు కోమల్ గాంధర్ , సువర్ణ రేఖ లను రీఫ్యూజీ ట్రయాలజీ గా చెపుతారు . విభజన కలిగించే విషాదాన్ని , మరీ ముఖ్యంగా మానవ సంబంధాలలో అది కలిగించే విధ్వంసాన్ని ఈ మూడు సినిమాలలో రిత్విక్ ఘటక్ చిత్రించినత బలంగా గొప్పగా మరొకరు చిత్రించలేదు అంటే అతిశయోక్తి లేదేమో .
శక్తిపాద రాజ్ గురు నవల ఆధారంగా రిత్విక్ మేఘ్ డాకా తారా ను తెరకి ఎక్కించాడు . ఈ కథను ఒక బెంగాలీ మాగజైన్ లో చదివిన రిత్విక్ షేక్స్పియర్ The Cloud Capped Star ను గుర్తుతెచ్చుకుని మేఘ్ డాకా తారా అని పేరు పెట్టుకున్నాడు .తెలుగు లో మేఘాలు మూసేసిన నక్షత్రం అని మనం చెప్పుకోవచ్చు . ఈ సినిమాను తెరపైన చిత్రిచడం లో రిత్విక్ శబ్దాన్ని ఉపయోగించుకున్న తీరు గురించి చాలా మంది ఇమేజింగ్ అంటూ చాలా సార్లు రాసారు . ఇప్టా ప్రోడక్ట్ అయిన జ్యోతీంద్ర నాధ్ మిత్రా కి పాశ్చాత్య సంగీతం మీద , బెంగాలీ జానపదం మీద చాలా పట్టు వుంది . రవీంద్ర సంగీతం తెలుసు . హిందుస్థానీ సంగీతం మీద కూడా చాలా అవగాహన వుంది . అలాంటి జ్యోతీంద్ర నాధ్ మిత్రా ఈ సినిమాకు సంగీత దర్శకుడు కావడం తో రిత్విక్ కి తన ఆలోచనలు అన్నీ సంగీతం లోకి అనువదించే అవకాశం దొరికింది . శుద్ధ గ్రామీణ జీవితం అర్బనైజ్ కావడం అనే అతి సున్నిత విషయాన్ని మరింత సున్నితంగా చిత్రించడం లో రిత్విక్ అద్భుతంగా సక్సెస్ అయ్యాడు . ఒక నోస్టాలిజియా , ఒక రియాలిటీ సంగమించే స్థలం మేఘ్ డాకా తారా
కథగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు . విభజన తరువాత తూర్పు పాకిస్థాన్ నుండి శరణార్థులుగా వచ్చిన ఒక కుటుంబం లోని ఒక పెద్దమ్మాయి కథ ఇది . ఆ పెద్దమ్మాయి పేరు నీతా . సినిమాలో ఈ పాత్రను సుప్రియా చౌదరి పోషించింది . చదువును అర్ధాంతరంగా వదిలివేసి కొన్నాళ్ళు ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పి , ఆర్ధిక పరిస్థితులు మరింత విషమించడం తో ఉద్యోగి గా కుదురుకుని కుటంబం మొత్తానికి ఆర్ధిక చుక్కాని అవుతుంది నీతా .
కుటుంబం కోసం దాని ఉన్నతి కోసం ఆమె తనను తాను కొవ్వొత్తిలా కరిగించుకుంటుంది . తన సహజాతాలు అన్నిటినీ చంపేసుకుంటుంది
ఆర్ధిక ఇబ్బందుల నుండి కుటుంబాన్ని బయట పడేయడమూ , తన చెల్లెలి కి మంచి జీవితాన్ని ఇవ్వడమూ , గొప్ప గాయకుడు కావాలి అనుకునే అన్న లక్ష్యం నెరవేర్చడము అనే ఉన్నత ఆశయాలముందు తన సౌఖ్యం , తన ఆనందం చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి . మతం లాగే త్యాగం కూడా ఒక మత్తు . ఒక మాదక ద్రవ్యం . ఆ మత్తులో ఉన్నంత సేపు గొప్ప ఆనందము ,సౌఖ్యము లభిస్తాయి
ఒక్క సారి ఆ మత్తులోనుండి బయటపడితే చుట్టూ జీవితం ఒక నిర్జన ఎడారిలా కనిపిస్తుంది . ఒయాసిస్సుల దరీ , దారీ ఎక్కడా కనిపించదు . తనదయిన జీవితాన్ని నిండుగా జీవించాలి అన్న కోరిక చివరి రోజులలో తలెత్తినా తలుపులు అన్నీ మూసుకునిపోయి, ఒక అగాధం లో కూరుకుని పోయి గొంతు చించుకుని అరిచే అరుపులన్నీ నూతిలో గొంతుకల్లా పీలగా వినిపించీ వినిపించకుండా వినిపించి విషాద నీలిమలో కలిసిపోతాయి. నీతాకి కూడా అలాగే జరుగుతుంది . చివరకు శానిటోరియం లో ఆమె నాకు జీవించాలని వున్నది అని ఆమె గొంతు చించుకుని వేసిన కేకలన్నీ చేరవలసిన చెవులకు చేరకుండానే గాలిలో కలిసిపోతాయి .
రిత్విక్ రీఫ్యూజీ ట్రయాలజీ లో మేఘ్ డాకా తారా మొదటి సినిమా . మిగతా రెండు సినిమాలు అయిన కోమల్ గాంధార్ (E ప్లాట్ ) సువర్ణ రేఖలలో కనిపించేంత ప్రస్ఫూటంగా శరణార్ధుల విషాదం కనిపించదు ఈ మేఘ్ డాకా తారా లో కనిపించదు . తూర్పు పాకిస్థాన్ నుండి కలకత్తా వచ్చి కాంప్ లో వున్నప్పుడు నమ్ముకున్న నేలను వదిలివచ్చిన విషాదమూ , ఉన్న వూళ్ళో ఉండి కలో ,గంజో తాగుతూ బతికితే పొందే ఆనందానికి దూరం కావడం అనే నిస్సహాయ నిర్వేదమూ జమిలిగా కనిపిస్తాయి . అయితే ఈ విషాదాన్ని మించిన మరొక వరం లాంటి శాపమైన దుస్థితిని రిత్విక్ ఈ సినిమాలో చాలా బలంగా వివరిస్తాడు
విభజన సమయం లో స్త్రీల మీద పెరిగిన వత్తిడి , దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు పడిన పెనుగులాట సామాన్యమైనదేమీ కాదు . తమ జీవితాలను తిరిగి పునర్నిర్మించుకోవడానికి మొదటి సారిమధ్యతరగతి స్త్రీలు గృహావరణం దాటి సామాజిక ఆవరణం లోకి అడుగుపెట్టారు . గృహం లో వుండే హింస ఎలాగూ ఉంటుంది . ఈ సామాజిక ఆవరణం లో ఎదురయ్యే సామాజిక హింస దానికి అదనం. తన సమకాలీన దర్శకుల ఊహలలోకి కూడా రాని అంశాలు ఇవి
నిజానికి బెంగాల్ లో 1947 కి ముందే కమ్యూనిస్ట్ పార్టీ మహిళా విభాగం MARS (Mahilaa Atma Raksha Samithi) బెంగాల్ కరవు రోజులలో చాలా బలంగా పని చేసాయి . తెభాగా ఉద్యమం , రైతాంగ ఆందోళనలు అన్నింటా స్త్రీలు ముందు భాగం లో నిలిచారు . అలా నిలిచిన వాళ్లంతా దిగువ మధ్యతరగతి , పేద వర్గాల స్త్రీలు . కాస్త భద్ర లోక జీవులు అనుకునే మధ్యతరగతి మహిళతో సహా ఎగువ మధ్యతరగతి , వున్నత వర్గాల స్త్రీలను కూడా విభజన సామాజిక ఆవరణం లోకి వచ్చేట్టు చేసింది . ఇలా సామాజిక ఆవరణం లోకి రావడం వాళ్ళకి మంచి చేసిందా ? లేక చెడు చేసిందా అంటే రిత్విక్ ఒక బలమైన జవాబే చెప్పాడు మేఘ్ డాకా తారా లో
ఒక సన్నివేశం లో నీతా తండ్రి " గతం లో చాలా చిన్న వయసులోనే ఆడ పిల్లలను వాళ్ళకంటే పెద్ద వాళ్ళు , వృద్దులు అయిన మగవాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్లు చేసి వాళ్ళని చితి మీదకు పంపే వాళ్ళు (సతి ?) కానీ ఇప్పుడు ఆడపిల్లకి చదువు చెప్పించి , వాళ్ళని ఉద్యోగాలకి పంపించి వాళ్ళను పీల్చి పిప్పి చేస్తున్నారు . కాలం ఎక్కడ మారింది ? తేడా ఎక్కడ వుంది ?" అంటాడు. ఇంత స్పృహ తో మాట్లాడిన ఆ తండ్రే మరొక సన్నివేశం లో " మనం తప్పు పట్టాల్సి వస్తే ఎవరిని తప్పు పట్టాలి ? ఎవరినీ తప్పు పట్టలేము " అని కూడా అంటాడు . నీతా జీవితం అంధకారం లోకి జారిపోవడానికి తన బాధ్యత ఏమీ లేదని తప్పించుకోవడం అన్నమాట
జెండర్ డిస్క్రిమినేషన్ , ఎక్సప్లాయిటేషన్ గురించి మారుతున్న సమాజం లో అది మార్చుకుంటున్న రూపాలగురించి చాలా సున్నితంగా లోతుగా రిత్విక్ చర్చించాడు "Those who suffer for others, suffer forever "అని మేఘ్ డాకా తారా బలంగా చెప్తుంది . నీతా కి తనని తన కుటుంబ సభ్యులు అందరూ ఎక్సప్లాయిట్ చేస్తున్నారని తెలుసు . కానీ దాన్ని ఎక్కడా ఎదుర్కోవడానికి ఆమె ప్రయత్నం చేయదు . జరిగే సంఘటనలు అన్నీ జరగనీ అన్నట్టు ఒక కర్మ సాక్షిలా చూస్తూ ఉండిపోతుంది . ఈ సినిమా ఆంగ్లేయులు భారతదేశాన్ని ఎలా తమ కాలనీ గా మార్చుకున్నారో , ఎలా ఆ కాలనీని పీల్చి పిప్పి చేశారో ,స్వాతంత్ర్యానికి ముందు తరువాత ఆ దోపిడీ ఎలా కొనసాగుతున్నదో చాలా సెటైరికల్ టోన్ లో చేసిన ఒక వ్యాఖ్య సినిమా
చివరి సన్నివేశం లో " నేనెప్పుడూ నాకు జరిగిన అన్యాయానికి అభ్యంతరం తెలపలేదు . అదే నేను చేసిన పాపం " అంటుంది . ఆమె మరణం ఆమె నిష్క్రియాపరత్వానికి లభించిన బహుమతి .
ఈ సినిమాను ఎప్పుడు చూసినా ఏదో ఒక అర్ధం స్ఫురిస్తూనే ఉంటుంది .
రిత్విక్ మిగతా సినిమాల గురించి మరొకసారి
వంశీకృష్ణ
(తాజా పాల పిట్ట సంచిక సెప్టెంబర్ 2020 సౌజన్యం తో )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి