12, డిసెంబర్ 2009, శనివారం

జీవితం ఒక అలవాటు

తొలి నాటి ప్రేమ పారవశ్యపు సైకత పూల పొదరిళ్లను
ప్రియా మళ్ళీ కదిలించకు
ఆకాశంలో రెక్కలు విప్పుకున్న హంసల గుంపులా
అవి పురానవ స్వప్నాలు అతి పురాతన జ్ఞాపకాలు

నీలం రంగు గేటు ఫై నుండి గౌరీ మనోహరాల చెట్టు
ఇంట్లోకి పూల పరిమళాలు పంపినట్లుగా
అవి హృదయం లోకి ప్రయాణించిన క్షణాలు

తొలి నాటి ప్రేమ పారవశ్యపు చలినెగళ్లను
ప్రియా మళ్ళీ వెలిగించకు
పుష్య మాసపు పుష్పోదయాన రంగవల్లికలో కూచున్న
గుమ్మడి పువ్వు మీద పరుచుకున్న మోహకాంతిలా
అవి విస్మృత గీతాలు వియోగాల వరసలు

తొలి నాటి ప్రేమ పారవశ్యపు సాంద్ర సంగమాలను
ప్రియా మళ్ళీ కలగనకు
అనాహుతంగా వచ్చిన రహస్య వానలో వొళ్ళంతా తడిసి
వణుకుతున్న చలి పిట్టలా
అవి చంద్రసీతల జలపాతాలు సాంద్ర తిమిర సంగమారణ్యాలు

2
జాలి లేని కాల విహంగపు కరకు రెక్కలు
జీవితపు గుండెల మీద నిప్పు పూల వనం లా విప్పుకున్నాక
ప్రేమ ఒక నోస్టాల్జియా అందామా ?
ఎప్పుడో ఎక్కడో అనుభవించిన డెజావు అందామా ?
డాలర్ చుట్టూ హృదయం భ్రమించడం మొదలయ్యాక
పోటి లేని పరుగులో విజేతలై ఎందుకు
పర్సనాలిటి డెవలప్ మెంట్ క్లాసులే సాయంకాల విహారాలయ్యాక
హృదయం ఒక యంత్ర భూతం అయ్యింది
సమయం వేళ్ల సందులనుండి ఇసుక మూటలా కరిగింది.
ముకేష్ లేదు
చిరుమువ్వల మరుసవ్వడి లేదు
ముషాయిరాలు లేవు
మూగకళ్ల మౌన భాషలు లేవు
జీవితం ఒక అలవాటయ్యింది
జీవనం వంద శాతం డీ వేల్యూ అయ్యింది.


ఆ పూల పొదరిల్లలోకి నన్ను ఎవరైనా ఆహ్వానించారా ?
ఆ చలినెగళ్లను మళ్ళీ వెలిగించారా ?
ఆ సాంద్ర సంగమాలనెవరైనా అందించారా ?

వంశీ కృష్ణ

1 కామెంట్‌:

  1. వంశీ గారు, బ్లాగ్లోకానికి స్వాగతం!
    డిజైను చాలా బావుంది. తెలుగు స్పెల్లింగు ఇంకొద్దిగా ప్రాక్టీసు చెయ్యాలి మీరు.

    రిప్లయితొలగించండి