రంగ మార్తాండ
రంగ మార్తాండ కోసం కృష్ణ వంశీ కంటే ఎక్కువగా ఎదురు చూసాను నేను. దానికి ప్రధాన కారణం నానా పటేకర్ , మేధా మంజ్రేకర్ . ఇవాళ రంగ మార్తాండ ఎలా వుంది అంటే నా జవాబు రెండు రకాలు . ఒకటి బావుంది . ఒకటి బావోలేదు. నటసామ్రాట్ తో పోల్చుకుంటే రంగమార్తాండ బావోలేదు . ఎందుకు పోల్చుకోవడం? అని అడక్కండి. ఒక సృజన రూపాన్ని మళ్ళీ కొత్తగా రీ క్రియేట్ చేసినపుడు పోలిక తప్పకుండా వస్తుంది. ఒక సారి చార్లీ చాప్లిన్ వేషం మీద ఒక పోటీ పెట్టారట. ఆ పోటీ కి చాలామంది చార్లీ చాప్లిన్ రూపం లో వచ్చారట. వాళ్లందరినీ ఒకే వరుసలో నిలబెట్టినపుడు అసలు చార్లీ చాప్లిన్ కూడా వచ్చి వరుసలో చివరగా నిల్చున్నాడట. ఆ పోటీ లో అసలు చార్లీ చాప్లిన్ కి రెండవ బహుమతి వచ్చింది. మొదటి బహుమతి చార్లీ చాప్లిన్ వేషం వేసిన వాడికి వచ్చింది. నేను కూడా రంగ మార్తాండ కి మొదటి స్థానం రావాలని కోరుకున్నా. కానీ నట సామ్రాట్ మొదటి స్థానాన్ని గెలుచుకుంది
కుసుమాగ్రజ్ అనే పేరుతొ పాపులర్ అయిన విష్ణు వామన షిర్వాడ్కర్ రాసిన నటసామ్రాట్ మరాఠీ లో చాలా ప్రసిద్ధి చెందిన నాటకం. దాని ఆధారంగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం లో వచ్చిన సినిమా మరాఠీ లో సంచలనం సృష్టించింది. ఒక ప్రసిద్ధి చెందిన నటుడి చివరి రోజులు , నాటకం , కుటుంబ బంధాలలో కనపడకుండా తిష్ట వేసుకుని కూర్చుని బంధాలను ధ్వంసం చేసే డొల్ల తనం, ముప్పేటలుగా అల్లుకున్న కథలో తన టార్గెట్ ఏమిటో మహేష్ మంజ్రేకర్ కి తెలిసినంతగా కృష్ణ వంశీ కి తెలియలేదు .అది పెద్ద లోపం. అయితే ఈ లోపానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది కృష్ణ వంశీ కాదు . తెలుగు సమాజం
నాటకం ఇప్పటికీ మహారాష్ట్ర లో సజీవంగా వుంది . సినిమా కి సమాంతరంగా , ఒక్కొక్కసారి సినిమాను సవాల్ చేస్తున్నట్టుగా వుంది. ధర్మకృత్ సుమంత్, మనస్వినీ రవీంద్ర లాంటి కొత్త తరం నాటక రచయతలు మరాఠీ లో సంచలనమ్ సృష్టిస్తున్నారు. కనుక మహేష్ మంజ్రేకర్ తన సినిమాలో టార్గెట్ నాటకం అని ఫిక్స్ అయిపోవడం లో ఎలాంటి సందిగ్ధాన్ని కానీ సంశయాన్ని కానీ పడలేదు. కానీ తెలుగు లో ఇప్పుడు నాటకం లేదు. కొత్త తరం పిల్లలకి నాటకం అంటే తెలియదు. ఒక నాటకం ఆడాలంటే ఎంత కష్టపడాలో తెలియదు. ఒక నాటకం ఆడాక నటుడు పొందే ఆత్మ తృప్తి ఏమిటో తెలియదు. తెలుగులో నాటకాన్ని సినిమా తొంభయి శాతం మింగేస్తే ఆ పదిశాతాన్ని టి వి మింగేసింది. బహుశా ఈ సంగతి తెలుసు కనుకే కృష్ణ వంశీ ముప్పేటలుగా అల్లుకున్న కథలో రెండవ అంశం అయిన వృద్ధాప్యం , పిల్లలు పట్టించుకోక పోవడం అనే అంశాలను టార్గెట్ చేసి ఉంటాడు .
ఈ సినిమా చూస్తున్న ఇరవై , పాతికేళ్ల సాఫ్ట్వేర్ పిల్లలకి తల్లి తండ్రుల దుఃఖం పట్టలేదు. నలభయ్,,యాభయ్ దాటిన ప్రేక్షకుడికి నాటకం కనెక్ట్ అయినా, వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ను సాటిస్ఫాయ్ చేసే స్థాయిలో కనెక్ట్ కాలేదు . అందుకే రంగ మార్తాండ నేను బావోలేదు అన్నది .
ఇక ఎందుకు బావుంది? చాలా రోజుల క్రితం సిటీ బ్యూటిఫుల్ , రాముడుండాడు రాజ్యముండాది లాంటి గొప్ప నవలలు రాసిన కేశవరెడ్డి గారు నాతో మాట్లాడుతూ " బ్రహ్మానందం వేసినవన్నీ బిలో యావరేజ్ వెకిలి వేషాలు " అన్నారు. ఇప్పటిదాకా బ్రహ్మానందం అంటే గుర్తుకు వచ్చే కిల్ బిల్ పాండే , మాక్డొవెల్ మూర్తి , జిలేబి లాంటి పాత్రల స్థానం లో ఇప్పుడిక రంగ మార్తాండ వచ్చి చేరుతుంది. బ్రహ్మానందం ఇప్పుడిక రంగమార్తాండ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది కృష్ణ వంశీకేమో కానీ బ్రహ్మానందానికి మాత్రం ఇది కమ్ బ్యాక్ సినిమానే.
శివగామిగా , నీలాంబరిగా చాలా లౌడ్ గా నటించిన రమ్యకృష్ణ తన పంథా నుండి ఒక్క ఇంచు కూడా అటూ ఇటూ కదలలేదు. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. కానీ ఇందులో ఆయన ఒకే పాత్ర చేయలేదు. కొన్ని వందల పాత్రలను తనలో ఆవాహన చేసుకున్న నటుడి పాత్రను చేసాడు. ఆ నటుడి పాత్రను చేస్తున్నప్పుడు అండర్ ప్లే చేయవలసిన చోట అండర్ ప్లే చేయాలి . లౌడ్ గా ఉండవలసిన చోట లౌడ్ గా ఉండాలి. ఒక ఒక్కడు లాగో , ఒక అంతఃపురం లాగో చేస్తానంటే కుదరదు . కానీ ఆ సమన్వయం ప్రకాష్ రాజ్ లో లోపించింది . హాస్పిటల్ సన్నివేశం నటసమ్రాట్ లో ఇద్దరు మిత్రుల నటనకి ఒక తారాస్థాయిని ఇస్తే రంగ మార్తాండ లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ను ఓవర్ షాడో చేసేసాడు.
నువ్వు చెత్త నటుడివి రా అంటూ ఒక సన్నివేశం లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ను అంటాడు . నిజం వందల పాత్రలలో నటించిన ఒక గొప్ప నటుడికి జీవితం కూడా ఒక పాత్రే. ఆ పాత్రలలో నటించి భావోద్వేగాలను ప్రదర్శించి మేకప్ తీసివేసిన తరువాత మామూలు మనిషి అయినట్టు నిజ జీవిత పాత్రను కూడా ఒక రంగస్థల పాత్రలాగే తీసుకునే స్థిత ప్రజ్ఞత రావాలి. ఆ స్థిత ప్రజ్ఞత ని నానా పాటేకర్ ప్రదర్శించినట్టుగా ప్రకాష్ రాజ్ ప్రదర్శించలేక పోయాడు. అందుకే నానా పాటేకర్ ను గుండెల్లోకి తీసుకుంటాము . ప్రకాష్ రాజ్ ను అబ్బురంగా చూస్తూ ఉండిపోతాము
మిగిలిన వారిలో శివాత్మిక బాగా చేసింది . ఈ అమ్మాయికి మంచి పాత్రలు పడితే చాలు. తెలుగు సినిమా మరొకరిని వెతుక్కోవలసిన అవసరం లేదు . నిజానికి రంగ మార్తాండ ఆత్మ ను సిరివెన్నెల సీతారామ శాస్తి ఆవాహన చేసుకున్నట్టు ప్రకాష్ రాజ్ చేసుకున్నట్టు లేదు . ఆ " పువ్వై విరిసే ప్రాణం, పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే " రంగ మార్తాండ నిలువెత్తు వ్యాఖ్యానం . కానీ ఇళయ రాజా " ఆసూత్రధారులెవరో" అనే మాటను ఆసూ త్రధారులెవరో గా విడదీయడం మాత్రం చెవులలో గులక రాళ్ళూ దొర్లించినట్టుగా వుంది
అయినా రంగ మార్తాండ బావుంది . ఎందుకంటే నీట్ గ వుంది. బూతులు లేవు . పాడ్ దేంగే లాంటి సంభాషణలు లేవు . కృష్ణ వంశీ నే తన మొగుడు సినిమాలో చేయించినటువంటి బూతు డాన్సులు లేవు .తప్పక చూడండి