25, డిసెంబర్ 2012, మంగళవారం

                ఈ పిల్లలని
ఈ పిల్లలని  అర్ధం చేసుకొవడం బహు కష్టం
తేనె చినుకులా ఎప్పుడు నవ్వుతారో
చలి వణుకులా ఎప్పుడు ఏడుస్తారో ...
ఆ నవ్వు వెనుక వున్నదంతా దుఖమేనా?
ఆ ఏడుపు వెనుక వున్నదంతా ఆనందమేనా?

ఫిల్లలు ద్వందా లకి అతీతులు
సరిహద్దుల సంకేతాలు  లేని సంధ్యా రాగపు సరిగమలు వాళ్ళ సొంతం

ఈ పిల్లలని అర్ధం చేసుకోవడం బహు కష్టం
వున్నదంతా  వూడ్చేసి  పక్క వాళ్ళకి ఇవ్వగలరు.
లేనిదాని కోసం హఠం చేసి ఏడ్పించనూ గలరు.
ఇవ్వడం వెనుక వున్నదంతా తీసుకొవడమేనా?
హఠం వెనుక వున్నదంతా ఇవ్వడమేనా?
 ఫిల్లలు లోయలూ శిఖరాలూ  అలవోకగా ఏక్కగలరు
జీవితం కంచీ దెబ్బలకి మనం విల విల లాడుతుంటే
వాళ్ళు మాత్రం చిద్విలాసం గా నవ్వగలరు

ఈ పిల్లలని అర్ధం చేసుకోవడం  బహు కష్టం
ప్రేమిస్తూనే  ఆటలో అరటిపండులా ద్వేషించగలరు
ద్వేషిస్తూనే ప్రేమాన్విత గాత్రమై శత్రువును కౌగలించుకోగలరు
ప్రేమనూ ద్వేషాన్ని 
భూగోళమనే  నాణేనికి వొకే వైపు నిలిపి
కొనగోటితొ ఏగుర  వెయ్యగలరు

ఈ దేశపు అత్యున్నత పీఠం పైన ఒక పసివాడిని నిల్పండి
వాడు దేశానికి ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాడు
ద్వేషాన్ని ద్వేషించడం ఎలాగో పాఠం చెపుతాడు

                         ................................వంశీక్రిష్ణ
  

24, డిసెంబర్ 2012, సోమవారం

వంశీక్రిష్ణ// శీత వేళ రానీయకు తన ఘన వక్షొజాలని ప్రియురాలు పైట తొ కప్పుకున్నట్లుగా శీతాంశుడి చలి కిరణాల ధాటికి తట్టుకోలెక ఈ కొండలు వెన్నెలను దుప్పటిలా కప్పుకున్నయ్ ఆగ్గి పూల చెట్టు మీది పిట్ట ఒకటి పులి పంజా విసరక ముందె పిల్లలని వెచ్హ చేయాలని స్వరాన్ని సవరించుకుంటున్నది నది లొ దిగిన వ్యాఘ్రమొకటి నదీగర్భంలోనె వుండి పొవాలని చలి పాతాన్ని తల పొస్తున్నది ఈ కార్తీక మాసపు తొలిజామున చలి బాధ పడ లేక సమస్త ప్రక్రుతి నందివర్ధనం పువ్వులాగా తనను తానే కౌగలించుకుంటున్నది తనలోకి తానే ముడుచుకుంటున్నది తన దేహాన్ని కాంక్షొన్మత్త కాంక్ష అంతు చూడాలని అతడనుకున్నాడు ప్రియురాలు అలిగి అటు తిరిగి పదుకున్నది ఆ చలి కన్నా ఈ చెలి ఎంత నిర్దయురాలు

7, ఆగస్టు 2011, ఆదివారం

నివాళి

రహస్తంత్రి మీటిన ఒక విషాద, నిషాద మొహనుడి గురించి......!

ఉదయమే బ్యాంకు కి బయలు దేరుతుంటే అఫ్సర్ నుండి ఫోన్. మో కి బాగా లేదట కదా అని. వెంటనే విజయవాడ లో వున్న కవి మిత్రుడు అరసవిల్లి కృష్ణ కి ఫోన్ చేసాను. బ్రెయిన్ డెడ్ అని చెప్పాడు. అప్పటి నుండి ఉండుండి ఒక వూండ్ ఏదో సలపరించడం మొదలయింది. శబ్దం,అర్థం లాంటి పెద్ద పెద్ద విషయాలు, చెప్పను కానీ మోహన ప్రసాద్ నిరీహ ఏదో ఒకటి నన్ను వెంటాడటం మొదలయింది. ఊహలన్నీ ఒక్క సారి గా నిర్జీవమి పోయి నట్లుగా ఒక అశాంతి.

మో తో నా పరిచయం చిన్నదే. పదోమ్మిదివందల ఎనభై దశకం లో నేను ఒక పదారు నెలల పాటు ఆంద్ర జ్యోతి వార పత్రికలో పని చేసాను. అఫ్సర్ , ప్రసేన్ అప్పుడు ఆంధ్రభూమి లో వుండే వారు. పురాణం సుబ్రమణ్య శర్మ గారి నుండి తోటకూర రఘు కి ఆంధ్రజ్యోతి సంపాదక బాధ్యతలు బదిలీ అయిన రోజులు అవి. వారపత్రికలో ఘంటసాల నిర్మల గారు, పురాణపండ రంగనాథ్ గారూ, తరువాత పి . రామ కృష్ణారెడ్డి గారూ నేను వుండేవాళ్ళం.


ఒక రోజు సాయంకాలం అఫ్సర్ హడావిడి గా వచ్చి ఇప్పుడు నీకేమి పని లేదు కదా మో తో కాసేపు మాట్లాడుకుందాము వస్తావా అన్నాడు. మో కవిత్వం పట్ల వున్న ప్రేమతో సరే పదా అన్నాను. ఆంద్ర జ్యోతి కిఎదురు గా వున్న డీలక్స్ బార్ పైన సమావేశం. అప్పటికే మో చేతిలో ఒక గలాసు. నేను మాడు తాగనని తెలిసాక ఆయన " అయితే ఇవాళ నీకు కన్యాదానం చేస్తాను " అన్నాడు. నిజానికి ఆరోజు కానీ మరే రోజు కానీ కన్యాదానం జరగనే లేదు. చాలా సేపు కవిత్వ చర్చలు జరిగాయి. అప్పుడప్పుడు మో నోటి నుండి వెలువడిన అపురూపమైన కవిత్వ వాక్యాలను నాప్కిన్ మీద రాసి ఆయనకు మర్నాడు ఫెయిర్ చేసి ఇచ్చాను. మో తో అది నా తొలి పరిచయం. ఆ తరువాత మో తో సాన్నిహిత్యం వచ్చే, పోయే చుట్టరికం లాగే సాగింది. మో కవిత్వావరణం లోకి వెళ్ళడానికి నేను ఒకింత భయపడటమే కారణం కావచ్చు.


ఆ రోజులలోనే ప్రమీల కపూర్ రాసిన ఇండియన్ కాల్ గర్ల్స్ పుస్తకానికి స్వేచ్చానుసరణ గా "ఏ రచయితా రాయని కధలు" పేరుతో రఘు కొంతమంది కాల్ గర్ల్స్ విషాద జీవన రేఖలని మాతో రాయించాడు. వాటిలో ఒక దానిని చదివాక మో స్పందించి "ఎడిటర్ జీ " అంటూ ఒక కవిత పంపించారు. దాన్ని చదివాక ఎక్కడ వేయాలో అర్థం కాక తోటకూర రఘు ఉత్తరాల పేజిలో బాక్స్ కట్టి ప్రచురించాడు. దాన్ని చూసి మో నవ్వడం నాకు ఇంకా బాగా గుర్తు వుంది.


సాహిత్య వేదికలో మో రాసిన అమరేశ్వరికి అనే కవిత చాలా మంది మో ఎప్పుడు ఎందుకింత సరళం గా రాయడు. అంటూ విసుక్కోవడమ నాకు బాగా గుర్తు వున్న జ్ఞాపకం. ఆంద్ర జ్యోతి వార పత్రికలో వున్నప్పుడు మో కవిత్వం ప్రచురించడం కోసం స్పేస్ అట్టే పెట్టి వుంచడం కూడా నాకు బాగా నచ్చిన విషయం.


***************************

ప్రతి తత్వ వేత్తకి ఒక భాష వున్నట్టు గానే ప్రతి కవికి ఒక భాష వుంటుంది. ఒక తాత్విక భూమిక వుంటుంది. కవి తాత్విక భూమికలు అర్థం కాక పోతే కవి భాష అర్థం కాదు. కవి భాష అర్థం కానప్పుడు అతడి కవిత్వం కూడా అర్థం కాదు. కవి అర్థం కావాలంటే కొంత శ్రమించాలి. కష్టపడకుండా ఏది అర్థం కాదు. కష్టపడటానికి ఇష్ట పడని వాళ్ళు నెపం కవి మీదకు నెట్టేస్తారు. అలా నెపాన్ని జీవితాంతం భుజాల మీద మోసిన కవి మో.


మో కవిత అర్థం కాలేదని ఎవరైనా అంటే వాళ్ళకు వాళ్ళ ఆంతరంగిక ప్రపంచంలో, జరుగుతున్న కల్లోలం తెలియదని అనుకోవాలి. వాళ్ళకంటూ ఒక ఆనుభవిక ప్రపంచం లేదని అనుకోవాలి. లేదు ఒక మూసలో ఉండటానికి ఇష్టపడే వాళ్ళు అనుకోవాలి. కర్త, కర్మ, క్రియ అనే మూస లో నుండి వాక్యం బయటపడితే అది వాక్యం కాదేమో అనే సందేహించే పామర సాహిత్య లోకం లో వాక్యానికి బంధవిముక్తి కల్పించిన మో ఎలా అర్థం అవుతాడు.


అక్షరాలూ పదాలుగా, పదాలు వాక్యాలుగా , భావాన్ని మోసుకుపోయే సంప్రదాయక పద్దతిని శీర్షాసనం వేయిన్చినవాడు మో. అందుకే ఆకాశం భూమ్మీద, భూమి ఆకాశం లో వున్నట్టు గా తెలుగు కవిత్వ ప్రియులు కంగారు పడ్డారు మో కవిత్వాన్ని చదివి. షహనాయిని , వయోలిన్ని కలిపి వయోనాయి అని మో కవిత్వీకరించి, దాన్ని స్త్రీ పురుష దేహాల సందేహ అస్తిత్వ ఆత్మకి ప్రతీకగా వాడితే మో అర్థం కాలేదని అన్నారు.


కవులు రెండు రకాల పద్యాలు రాస్తారు. ఒకటి సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ మరొకటి సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సు . మొదటి పద్యం అనుభవంలోకి వచ్చినంత తేలికగా రెండోది అనుభవంలోకి రాదు. రెండోది రావాలి అంటే జీవితం ఆగ్రహించాదమో, అనుగ్రహించాదమో జరగాలి. మనలో చాలామందికి జీవితం ఏ అనుభూతిని ఇవ్వకుండానే ముగిసి పోతుంది. అందుకే అనుభావారణ్యం వొట్టి చవితి పర్ర లాగా ఉండిపోతుంది. ఆనుభవిక ప్రపంచం అనే మాటనే వాళ్ళు గుర్తించరు . అలాంటప్పుడు, కవిత్వం సందేహాన్నుంది సందేశానికి, దేహాన్నుడి హృదయానికి ప్రయాణించాలి అని మో ఎంత చెపితే మాత్రం ఏం లాభం? స్పీచ్ వితిన్ ది స్పీచ్ లా , సీక్వెన్సు ఆఫ్ మ్యుసికాల్ ఫ్రేజ్ లా వుండాలి కవిత్వం అంటే ఎవరు వింటారు?


***********************

భరణి పురస్కార తడి ఆరకుండానే మో నో మోర్ అనుకుంటే ఉండుంది ఒక వూండ్ సలపరిస్తోంది.
................ వంశీకృష్ణ