1, ఫిబ్రవరి 2018, గురువారం

కవిత్వ ప్రపంచం

మానేపల్లి హృషీకేశవ   రావు  నుండి  నగ్నముని దాకా ...... !


ఒక మృదువైన వాక్యం రాయాలంటే ఎన్ని ఉక్కు గుండెలు ఉండాలి ?  అని ప్రశ్నించాడు ఒక కవి . దాన్నే కొంచం మార్చి ఒక ఆగ్రహ వాక్యం రాయాలి అంటే ఎంత నిగ్రహం ఉండాలి మనసులో ? ఒక్క ద్వేష పదచిత్రాన్ని తీర్చి దిద్దాలి అంటే లోలోపల ఎంత ప్రేమ ఉండాలి ? ఆ ప్రేమ ఎంతలా దహించాలి ? అని అడుగుతాను నేను . 

నేను ఖమ్మం లో చదువుకునే రోజులలో కవిత్వం లో మమ్మల్ని ఇన్స్పైర్  చేసి తరచూ మా ఆంతరంగిక ప్రపంచాలలోకి నిరభ్యంతరంగా ప్రవేశించిన కవులు ముగ్గురు . ఒకరు శ్రీశ్రీ మరొకరు శివారెడ్డి ఇంకొకరు నగ్నముని . శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు మా చేతుల మీదుగా గోడల మీద ఎర్రటి జాజు తో నినాదాలు అయ్యేవి . అలజడి మా జీవితం . ఆందోళన మా ఊపిరి , బడులలో చెప్పని చదువును , బతుకులలో తరచి చూసి భవితవ్యపు  స్వర్గసీమ ను త్యాగాలతో నిర్మిస్తాం ఇలా ఎన్నో కవిత్వవాక్యాలు మా ఖమ్మం గోడలని వెలిగించేవి . వీటిని రాసుకోవడం కోసమే మేము గోడలను రిజర్వు చేసుకునేవాళ్లం . R/pdsu 
ఇలాగ. ఆ రోజులలోనే నా మిత్రుడొకరు నగ్నముని ప్రసంగం వినకపోతే మన జన్మ వృధా అన్నాడు ఒకసారి . ఆ తరువాత ఎప్పుడో చేరా కొయ్యగుర్రానికి ముందుమాట రాస్తూ నగ్నముని చదువుతుంటే ఈ కావ్యాన్ని వినే  అవకాశం నాకు లేక పోయింది అని రాసుకున్నాడు .నగ్నముని ప్రసంగాలు ఆయన కవిత్వం లాగే ఒక తరాన్ని ప్రభావితం చేశాయి . 

చాలా కాలం క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధాల లో ఏడో ఋతువు పేరుతొ ల్యాండ్ స్కీప్  లో అడ్డంగా ఒక పెద్ద కవిత ప్రచురించింది . ఈదేశం లో ఎన్నికలు ఏడోరుతువు  అంటూ సాగిన కవిత ఎందుకోగానీ బాగా గుర్తుంది పోయింది . కవిత కింద నగ్నముని అని వుంది . నగ్నముని కవిత్వాన్ని మొదటి సారి చదివిన సందర్భం అది . ఆ జ్ఞాపకం పచ్చి పచ్చిగా నాలో ఇంకా అలాగే వుంది . అక్కడి నుండి కవిత్వమనే  గూగుల్ లో నగ్నముని పేరు తో నా సెర్చింగ్ మొదలు అయింది . 

అందరు కవులలాగే నగ్నముని కూడా తన కవిత్వ ప్రస్థానాన్ని ఒక ప్రేమ కవిత తో మొదలుపెట్టాడు . 
స్వతంత్ర లో 1958 లో రాసిన సౌందర్యపు స్వగతం నగ్నముని తొలి కవిత . నగ్నముని అసలుపేరు మానేపల్లి హృషీకేశవరావు . కానీ సౌందర్యపు స్వగతాన్ని  సుధ  పేరుతొ రాశాడు . తొలి  కవిత తోనే  చేరా ను బలంగా ఆకర్షించాడు . ఉదయించని ఉదయాలు కేశవరావు మొదటి కవితాసంపుటి . పేరు లో వున్న  అంబిగ్యుటీ  మాత్రం కవిత లో లేదు . అయినా ఉదయించని ఉదయాలు ఏమిటీ ? నా బొంద !
కవిలో కొంత గందరగోళం వుంది అన్నాడు అజంతా . 

తన సమకాలీన కవులు మరో అయిదుగురు తో కలసి దిగంబర కవిగా కొత్త  రూపాన్ని ధరించాడు కేశవరావు . తన పేరును కూడా సుధ  అని కాకుండా , కేశవరావు అని కాకుండా నగ్నముని అని మార్చుకున్నాడు . ఒక ప్రత్యేకమైన సందర్భం లో మార్చుకున్న పేరును ఆ ప్రత్యేక సందర్భం తరువాత కూడా అలాగే కొనసాగించారు ఆ ఆరుగురు . అలా దిగంబర కవి నగ్నముని గా , కొయ్యగుర్రం సృష్టి తో కొయ్య గుఱ్ఱము  నగ్నముని గా ఆ తరువాత విలోమ కధల నగ్నముని గా ఎన్ని రూపాలో  ఒక్క కవికి 

నగ్నముని కి కవిత్వము ఆచరణ రెండూ వేరువేరు కావు . అందుకే " కసాయి వాడు అహింస  మీద సభ పెడుతుంటే జీవ కారుణ్య వాదులంతా హాజరు అవుతారా ? " అన్న కొడవటిగంటి కుటుంబరావు గారి ప్రశ్న లోని సమంజసత్వాన్ని గ్రహించి మొదటి ప్రపంచ తెలుగు మహాసభలని నగ్నముని బహిష్కరించి తెలుగు మహాసభల ప్రాంగణము  ముందు నిరసన ప్రకటించి అరెస్ట్ అయినాడు . 

దిగంబర కవులలో నగ్నముని డి ప్రత్యేకమైన , బలమైన గొంతు . ఈ వ్యవస్థని సుఖ రోగి తో పోల్చి  ఇక్కడ జరుగుతున్నది అంతా కొజ్జాల కామకేళి గా భావించి ఒక కాస్మిక్ జాతి కోసం పరితపించారు . తొడలు  విరిగిన తరం మొహం మీది చంద్రుడు యూ జైల్లో సముద్రం తో పోల్చి తన హృదిక్ లను వినిపించాడు . మాచకమ్మ ప్రతాపాన్ని కుష్టుదేవుళ్ళ  తో పోల్చాడు . మిగతా దిగంబర కవులతో పోలిస్తే నగ్నముని లో భావ తీవ్రత , రూప తీవ్రత రెండూ ఎక్కువే . 

జీవితం 
అబద్దమా 
ఈ ప్రపంచపు నాటకం అబద్దం 
నే చొక్కా చెడ్డీ విప్పేస్తే 
సిగ్గు శరం  సంధిస్తే 
అమ్మా ! 
నీ రొమ్ములో నే తాగిన  పాలు అబద్దం 
నేనీ లోకం లోతాగి  వమనం  చేసిన భాషలోని అర్ధాలు 
అబద్దం 
ఒక్కటి నిజం 
ఒక్క క్షణం నిజం 
నా సంఘం బట్టల మురికి వెనుక 
సిగ్గుతో కుమిలికుమిలి ఏడ్చే నేను నిజం 
ఆ రాత్రి నా నీగ్రో చెలి కౌగిలి లో 
ఊరువుల కొండ చరియల్లో చంద్రోదయం 
నిజం 
నా నిలకడ నిజం  నా విశ్వాసం  నిజం, 
ఇన్ని నిజాలవెనుక నా ఊపిరి గట్టుపై నిలబడి 
పగలబడి నవ్వుతున్నది 
ఆకలి నా నీగ్రో చెలి 
అని దిగంబర  నృత్యం లో అంటాడు . ఆకలి ని నీగ్రో చెలి తో పోలుస్తూ తన తోటి దిగంబర కవుల నుండి కొంచెమే పక్కకు జరిగి తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు . ఊరువుల కొండల్లో చంద్రోదయాన్ని ఊహించడం , ఆకలి నా నీగ్రో చెలి అనడం ద్వారా తాను దేహాత్మల సంయోగానికి ఆకలి ప్రతీకగా మల్చుకున్నాడు . భౌతికమైన ఆకలిని మానసికమైన ఆకలిని సమానం చేయడం ద్వారా ఒక మానవీయ సమాజం తనలో నివసిస్తున్న జనుల ఆధ్యాత్మిక , మానసిక అవసరాలను కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాడు . అసమగ్ర సమాజం లో తల్లి రొమ్మునుండి తాగిన చనుబాలు కూడా అబద్దం అని చెపుతూనే నా నిలకడ నిజం , నా విశ్వాసం నిజం అనడం ద్వారా ఒక ఆశావహ దృక్పథానికి తెర తీస్తున్నాడు . దిగంబరకవులు అసహాయతను , నిరాశను , మనుష్య ద్వేషాన్ని గానం చేశారు అనే విమర్శనుఁ పూర్వపక్షం చేశాడు. వచన తిరస్కారాన్ని ఇతర దిగంబరులు కంటే బలంగా వంట పట్టించుకున్న నగ్నముని తన సహచరుల లాగా తిట్టు ను కేవలం సమాజం లోని అవ్యవస్థ ఫై కసిగా నిలదీయడానికి మాత్రమే కాకుండా దాన్ని ఒక తాత్విక స్థాయి కి తీసుకుని వెళతాడు . ఈ విషయాన్నే వెల్చేరు తన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం లో బలంగా వివరిస్తూ " ఉదాహరణకి కొజ్జాల కామకేళి చూస్తున్నాను అనే రచనలో అశ్లీల ఆరోపణతో దిగంబర కవిత్వాన్ని నిందించే వారికి సమాధానం చెప్పడం కోసం సమాజ స్థితిని బలీయంగా చెప్పి దేశమాతని పదవీ వ్యామోహితులు చెరిచే పరిస్థితిని వర్ణిస్తాడు నగ్నముని . ఆ వర్ణన లో లైంగిక ఉపమానాలు క్షుద్ర  పరిస్థితిని  వ్యక్తం చేసే సాధనాల స్థితి దాటి లైంగిక క్షుద్రత్వాన్ని తదేక ప్రయోజనం గా చిత్రించే స్థితి కి వస్తాయి . ఈ స్థితికి వచ్చేసరికి కవి మానవ విలువలని ధ్వంసం చేసే పనిని ఒక తాత్విక స్థాయికి తీసుకుని వెళ్లినట్టు స్పష్టపడుతుంది . 

ఒరే  పీనుగా 
ఇది కూడా నీకు అశ్లీలం గానే కనిపిస్తున్నదా ? 

అని వెనక్కుతిరిగి తన రచన మొదలుపెట్టిన ప్రయోజనం వైపు మళ్లుతాడు . కానీ మధ్యలో వచ్చిన లైంగిక ప్రతీకలకి ఈ ప్రధాన ప్రయోజనం తో సంబంధం లేకుండా పోతుందిఈ విమర్శ సబబుగానే తోస్తుంది . కానీ ఒక ఆవేశం తో కవిత తనను తానూ రాసుకుంటునప్పుడు  మధ్యమధ్య లో దారితప్పి మళ్ళీ పట్టాలు ఎక్కడం లాంటి విన్యాసాలు సెక్స్ ను ప్రతీకగా తీసుకుని రాసిన ఆంగ్ల కవిత్వం లో కూడా బలంగానే కనిపిస్తుంది . అక్కడ కనిపించడం వలన ఇక్కడ లెజిటిమసీ  వస్తుందని కాదు కానీ ఇక్కడ కవిత్వ రచన  " Re collected in tranquility " కాదు అని చెప్పడమే . 

 మల్లెల మంద యామినులు . 
ఫ్లాస్క్ లో విరబూసిన కాఫీ పరిమళాలు 
గ్లాసులచుట్టూ ఒత్తైన వేళ్ళ ఒత్తిళ్లు 
చిరునవ్వు లద్దుకున్న  కాశ్మీర్ పూదోటలు 
ఆధారాలు ఆక్రమించుకున్న సూర్యోదయాలు 
మీద పై వక్షోజాల ఉన్నతుల  తటిల్లతల 
రహస్య లోయల కాదిశీక ప్రయాణాలు 
చేతివేళ్ల సరిగమల సఖులు ప్రియబాంధవులు 
పరవశత్వపు పలుకుల ఖర్జూరాలు 
ఏవి ? 
సూర్యునికి అడ్డంగా నిలుచున్న  
ఆ మబ్బుతునక పేరేమిటి ? 

లాంటి వాక్యాలు నగ్నముని కవిత్వం లో కోకొల్లలు .పైన చెప్పిన వెల్చేరు భాషలో నిహిలిస్ట్ లక్షణము 
ఈ జైల్లో సముద్రం కవిత్వం లో కనిపిస్తున్న రొమాంటిక్ లక్షణము రెండు కలగలసి నగ్నముని ని అంత అశ్లీలం లోనూ ప్రత్యేకంగా కనిపింప చేస్తాయి . 

బతికి ఉండటం అంటే 
ఉదయాస్తమయ రేఖలుగా జీవితం క్షణక్షణమ్ పూయడం 
టీ కాఫీ విస్కీ అనేకానేక చిరు ఆనందాలు సైతం 
ఆప్యాయంగా అంతరంగపు నిప్పు పెదవులతో సిప్ చేయడం 
ఝల్లుమనే  తరంగాల   తరంగాలుగా 
సంగీతపు పరిమళాకారులుగా శిశువులని చర్మపు సున్నితోద్రేకాలతో పలకడం 
శిశువులు నీడనిచ్చే వృక్షాలుగా ప్రజలు కావడం 
ఆలోచన అవయవాలు అవసరమైన ఆకాశాలని చదువుకొవడం 
మనిషి మనిషి మధ్య ఎడారులను  దున్ని సిద్ధాంతాల సహనం పండించడం 
అనిర్వచనీయ లోచనాలతో విస్వంతరాళాలని వెలిగించడం 
ప్రపంచం ఒకే ప్రశ్న గా 
కనిపించని ఆ రహస్య ముఖంగా ఊపిరి పీల్చడం 
ఇదే మనిషి బతికి ఉండటానికి సంకేతం 
అని నగ్నముని దిగంబర కవులుగా తాము ఎలాంటి లోకాన్ని కోరుకున్నారో చెప్పకనే చెప్పాడు .ఒక చారిత్రిక సందర్భం లో వచ్చిన దిగంబర కవిత్వం లో నగ్నముని ది  సింహభాగం 


దిగంబర కవిత్వం తరువాత మళ్ళీ Nagnamuni strikes again  అని తెలుగు ప్రపంచం తో అనిపించుకున్నది  కొయ్యగుర్రం తో . కొయ్యగుర్రాన్ని చేరా ఆధునిక మహాకావ్యం అన్నాడు . 1978 లో ప్రజాతంత్ర  వార పత్రిక లో కొయ్యగుర్రం వచ్చింది . దాని ప్రచురణకి ముందు "తుఫాను వ్యవస్థ మీద తెలుగు కవి కన్నెర్ర " పేరు తో సంపాదకులు ఒక ముందస్తు ప్రకటన కూడా ఇచ్చారు . అలా ఒక కవిత కి ప్రచురణకు ముందే యాడ్ ఇవ్వడం కూడా కొయ్యగుర్రం తోనే  మొదలేమో . 
1977 నవంబర్ 19 తెలుగు ప్రజలు మరచిపోవాలన్నా మరచిపోలేని దుర్దినం . ఆ రోజు కృష్ణా జిల్లాలోని దివిసీమ మొత్తం సముద్రం ఆగ్రహం చవిచూసి ఉప్పెనకు బలి  అయిన దుర్దినం . ఆ మహావిషాదం లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం  వ్యవహరించిన తీరు మహా మహా దారుణం . నిజానికి ఈ ప్రభుత్వాలు కొయ్య గుర్రం లాంటివే . కొయ్యగుర్రం కదులుతున్నట్టు కనిపిస్తుంది . కానీ ఎక్కడికీ కదలదు . ఉన్న  చోటే ఉంటుంది . ఎక్కడ వేశిన గొంగళి అక్కడే ఉంటుంది . 
ఇనప నాడాల్తో 
చెక్క హృదయం తో 
ధన మదం తో 
అలగాజనం భుజాలమీద 
స్వారీ చేసే కొయ్య గుర్రా లున్నంత కాలం గుర్తుంచుకోవలసిన దుర్దినం 
మనిషి బతికుండగా దాహం తీర్చలేని ఉప్పునీటి సముద్రం 
నదుల నుంచి నీళ్ళని కౌగిళ్ళలోకి లాక్కుని 
తనివి తీరా తాగి తాగి 
తెగబలిసిన  కొండచిలువలా 
మెలికలు తిరిగి 
కాలం పై 
భూగోళం పై 
అలగాజనం ముఖాలపై 
వృక్షాలపై , పక్షులపై 
సమస్త జంతుజాలం పై 
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి 
నీటి తో పేనిన తాళ్ల తో గొంతులు బిగించి 
కెరటాలతో కాటేసి వికటాట్టహాసం తో 
బుసలు కొడుతూ పరవళ్లు తొక్కిన రోజు 
1977 నవంబర్ 19
కొయ్యగుర్రమెక్కి 
కొయ్యకత్తి  తో ఊరేగే ప్రభుత్వానికి 
తీరమంతా గుడిశె ఉందని తెలుసు 
గుడిశె ముందు పుట్టలున్నాయని తెలుసు 
పుట్టలో కోడెనాగులున్నాయని తెలుసు 
పండగల్లో విషముంద ని తెలుసు 
అయినా ప్రభుత్వం ప్రజలని గాలికి వదిలివేసింది . తన బాధ్యతను వదిలివేసింది . ఇప్పటికీ మనం నవంబర్ వచ్చిందంటే వార్తాపత్రికల నిండా దివిసీమ ఉప్పెనకి ఇన్నేళ్లు ,అన్నేళ్లు అని చదువుతూనే ఉంటాము . ఒక బాధ్యత గల  పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనప్పుడు ఒక కవి ఆక్రోశం కొయ్యగుర్రం . 

కొయ్యగుర్రం  
స్తబ్దతకీ , మూర్ఖతకీ , అజ్ఞానానికి , అంకారానికీ 
అసమర్ధ పాలనకీ  ప్రతీక 
అని చెపుతూ 
హంతకులెవరో తెలుసు 
నెపం కాసేపు సముద్రం మీదకు తోస్తాను 
అయినా మరేం పర్వాలేదు 
కంకాళం సంజాయిషీ కోరదు 
మరేం ఫర్వాలేదు 
అనాధ ప్రీతమ్ సంజాయిషీ కోరదు 
జెండా కన్నీరు కార్చదు 
అంటాడు  నగ్నముని . నగ్నముని ని ప్రభావితం చేసిన అజంతా జెండాలకు  కన్నీళ్లు లేవు అన్నప్పుడు ఆ జెండా సామ్రాజ్యవాదానికి ప్రతీక . ఇప్పుడు ఈ జెండా హృదయానికి ప్రతీక . జెండా కన్నీరు  కార్చదు  అనడం లో నగ్నముని చూపిన వెల్చేరు మాటలలో చెప్పాలంటే వాక్యగత వ్యవస్థని భగ్నం చేయడం ద్వారా సాధించే ప్రయోజనం ఎనలేనిది . 
ఇప్పటికీ మనం నెపం దేనిమీదో ఒక దాని మీద వేస్తూనే వున్నాము . ఇప్పుడు  సముద్రమే కాదు , కేవలం ప్రాకృతిక శక్తులే కాదు , బహుళ జాతి సంస్థల నుంచి  బహుళ జాతి నాయకుల వరకు అందరూ హంతకులే  . మరేం పర్వాలేదు కంకాళాలు సంజాయిషీ కోరవు . జెండాలు కన్నీరు కార్చవు 

ఈ గ్లోబల్ సందర్భం లో కూడా కొయ్యగుర్రానికి చాలా ప్రాసంగికత ఉంది . నిజానికి అప్పటికంటే ఇప్పుడే మరింత ప్రాసంగికత ఉంది . ఆ ప్రాసంగికత గురించి కల్లూరి భాస్కరం "గ్లోబల్ సందర్భం లో కొయ్యగుర్రం " పేరుతొ విపులమైన వ్యాసం రాసాడు 

3

నగ్నముని విలోమ కధల పేరుతొ రాసిన కధలు ఎంతో  విలువైనవి . కవిత్వం అంతగా స్పష్టం కాని 
నగ్నముని తన కధలలో విశ్వరూపాన్నే  చూపిస్తాడు . కధల గురించి వివరించడానికి ఇది వేదిక కాదు కనుక ఇక్కడ కధల గురించిలేశ మాతం కూడా వివరించడం లేదు . కానీ నగ్నముని కధలు చదవక పోతే నగ్నముని సగమే అర్ధం అవుతాడు . మనం తెలుసుకోవలసిన మరొక పార్శ్వం అచుంబితంగా  ఉండిపోతుంది

ఆలోచనకి  మనిషికీ ఉన్న  సంబంధం ఏమిటి ?
భాషకీ భావానికి ఉన్న  సంబంధం  ఏమిటి ?
వేదనకీ  శరీరానికీ ఉన్న  సంబంధం ఏమిటీ ?
నేలకీ  నీటికీ వున్నా సంబంధం ఏమిటి ? 
అనే మూలాధార ప్రశ్నలకి , తాత్విక భావదారకీ తగిన జవాబులు తెలుసుకోవాలనుకుంటే తన వచన రచనలు కూడా చదవాలి . 

నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషీకేశవరావు . మొదట్లో సుధ  పేరు తో ఆరంగేట్రం చేసి కేశవరావు గా ఉదయించని ఉదయాలు ఉదయింపచేసి , నగ్నముని కా కుదురుకున్నాడు . 
ఈ కవిత్వ ప్రపంచం లో పరిచయం చేస్తున్న కవుల మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క గ్రంధాన్నే  రాయాలి . కొండ  అద్దమందు కొంచమై  ఉండదా అని కదా కవి సూక్తి . ఈ వ్యాసాలు  చదివాక ఆయా కవుల కవిత్వాన్ని మీరు పూర్తిగా చదవాలన్నదే కవిత్వ ప్రపంచం కోరిక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి