11, మార్చి 2011, శుక్రవారం

ఆ ఒక్కటి లేక పోతే ......

ఆ ఒక్కటి లేక పోతే ......


ఇవాళ కాస్త ఆనందం గాను మరికొంత బాధగాను వుంది. మిలియన్ మార్చ్ విజయవంతం అయినందుకు రవ్వంత గోరంత కొండంత ఆనందము, తెలుగు జాతి కి ప్రాతః స్మరనీయులైన మహనీయుల విగ్రహాల కూల్చివేత పట్ల అంతే బాధగాను వుంది. మనోభావాల గురించి మాట్లాడే వాళ్ళు మరొకరి మనోభావాలను పట్టించుకోక పోవడం పట్ల చెడ్డ చిరాకుగాను వుంది. విగ్రహాల కూల్చివేత కంటే ఆ సంఘటన పట్ల రాజకీయ వాదుల , ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుల ప్రతిస్పందన చూస్తె మరింత అసహనంగా వుంది. ఒక తెలంగాణా వాడి గా ఇలా రాయడం కొంత మంది తెలంగాణా వాదులకు కోపం తెప్పించ వచ్చు. కానీ ఉద్యమాల పేరుతో చేసే ప్రతి పనిని సమర్దిన్చాలనుకోవడం కూడా పొరపాటే. ఒక మహా ఉద్యమం జరుగుతున్నప్పుడు దొరలే అపశ్రుతుల గురించి ఆత్మ విమర్శ చేసుకొని ముందుకుపోవడం వివేచనతో కూడిన పని అవుతుంది. ఉద్యమంలో నాలుగు వందలకు పైగా విద్యార్ధులు ఆత్మ బలిదానం చేయడం నిస్సందేహంగా బాధాకరమైన విషయమే. అలాగే విగ్రహాల కూల్చి వేతకూడా బాధాకరమే. రెండింటికి పోటీ పెట్టనవసరం లేదు. నిరంకుశ నిజం కాలం లో శ్రీక్రిష్ణదేవరాయంధ్ర భాషా నిలయం తెలంగాణా సాంస్కృతిక పునర్వికాసానికి ఎంత కృషి చేసిందో ఇప్పటి ఉస్మానియా పిల్లలకి తెలియకపోవచ్చు. ఆంద్ర అన్నా శబ్దం తెలంగాణా లో ఆత్మ గౌరవ చిహ్నం ఎలా అయిందో కూడా ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. కానీ ఎవరు చేరిపివేయాలని చూసినా చెరగని సత్యం చరిత్ర. ఇవాళ విగ్రహాలను కేవలం ఉత్త విగ్రహాలు గానే చూడటం అంటే అవి అందించే నిరంతర స్ఫూర్తిని పూర్వ పక్షం చేయడమే. విగ్రహాలు ఉత్త విగ్రహాలే కాదు. అవి మన జాతి నడచివచ్చిన జ్ఞాపకాల పాద ముద్రలు. మన ముందు తరాల అడుగుజాడలు. మనం మరింత నాగరీకులుగా తయారు కావడానికి కావలసిన తాత్విక భూమికలను అందించిన చింతనా ముద్రలు. విధ్వంశానికి గురి అయిన గుర్రం జాషువా నే తీసుకోండి. ఆయన గుంటూరు జిల్లలో పుట్టినప్పటికీ తనను తాను విశ్వ నరుడు అని చెప్పుకున్నాడు. ఇవాళ రాష్ట్రం లో ఆ మాట కొస్తే దేశ వ్యాప్తం గా బలంగా అల్లుకున్న దళిత వాదానికి ఆత్మ అనుభవం లోంచి ఒక తాత్వికతను అందించినవాడు. శ్రీ శ్రీ కష్ట జీవికి ఇరువైపులా నిలిచే వాడే కవి అని చాటి చెప్పిన వాడు. తెలుగు కవిత్వానికి ఒక కొత్త చూపును ఇచ్చినవాడు. శ్రీ శ్రీ ని ఆంధ్రా వాడిగానో , తెలంగాణా గురించిమాట్లాడని వాడిగానో చూడటం అంటే అది హ్రస్వ ద్రష్టి . బ్రహ్మ నాయుడు పలనాట చాపకూడు తిని దళిత బహుజన రాజ్యం గురించి అన్యాపదేశం గా అయినా ప్రవచించిన వాడు. అన్నమయ్య రాజు కి బంటు కి తేడా లేదన్న ఆధ్యాత్మిక విప్లవ కారుడు. వీళ్ళందరినీ ఏ ప్రదేశాల సర్హిద్దులలో నిలిపి వాళ్ళ జీవిత సారాలకి చెలియలి కట్ట వేయగలం. అలా చేస్తూ పోతే తెలంగాణా సరహద్దు వదిలి పోతన బయటికి తన మందార మకరంద మాధుర్యాన్ని చవి చూప కూడదా ? ప్రతి ఉద్వేగానికి ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వుంటుంది. ఈ సంగతి ప్రభుత్వాలు కూడా గుర్తు వుంచుకోవాలి. ఇవాళ తెలంగాణా ఉద్వేగం ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి చేరుకుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించ క పోవడం వలెనే ఈ విధ్వంసం అంతా . ఇవాళ ఉదయం ఒక తెలంగాణా మేధావి తో మాట్లాడితే అతను ఒక మాటఅన్నాడు. ట్యాంక్ బండ్ మీది శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం లో విసిగిపోయిన తెలంగాణా వాడికి కిరణ్ కుమార్ రెడ్డి, జాషువా విగ్రహం లో డి జి పి అరవింద రావు కనిపించి వుందా వచ్చు అని. సమర్ధనకి ఈ లాజిక్ బావుండవచ్చు కానీ ఇతరేతర ఆంద్ర ప్రాంతాలలో కే సి ఆర్ కనిపిస్తే మాత్రం అంతర్యుద్దం తప్పదు. అయినా తెలంగాణా సంస్కృతి అంటే కూల్చివేతల సంస్కృతి కాదు కదా? కూల్చడం తేలికే అది విగ్రహమైనా జీవిత మైనా ? రేపు పొద్దున్న తేలగాన ఏర్పడిన తరువాత జీవితాలను నిర్మించాల్సిన వారు ఇలా కూల్చివేతలకు పాలుపడ కూడదు. కూలిన విగ్రహాల స్థానం లో ఒక తెలంగాణా తల్లిని, ఒక బతుకమ్మని, ఒక చిందు ఎల్లమ్మని, ఒక కొమరం భీమ ని ఊహించుకోండి. గుండె మేలి తిప్పడా? ఐరనీ ఏంటంటే ఆ విగ్రహాలను తయారు చేసిన శిల్పి ఒక తెలంగాణా వాడే. బహుశ అతడి వయసు పూర్తిగా మీద పది ఉండవచ్చు. అతడిని ఇప్పుడు ఆ విగ్రహాలను తయారు చేయమంటే చేయలేదు కూడా? ఆ ఒక్క అపశ్రుతి లేక పోతే ఎంత బావుండేది?

1 కామెంట్‌:

  1. ధన్యవాదాలు వంశీ కృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం విషయంలో ఎవరికీ ఎటువంటి అబ్యంతరాలున్నా అవి ఎవరి వారి వ్యక్తిగత ఆలోచనలు అంతమాత్రాన పోరాట స్పూర్తిని శంకించనవసరంలేదు.తెలంగాణ వాదులను దోషులుగా చూడనవసరం లేదు.పోరాటం అన్నది ఆయా ప్రాంతాల వారి హక్కు. అలాగే అది తెలంగాణ వాదుల జన్మహక్కు. ఈ విషయం నాలాంటి వారు చెబితేనే తెలియదా...అని నేను అనుకోను. కాని విగ్రహాల విద్వంసం విషయంలోనే మనుషుల మద్యన అగాధం సృష్టించటానికి అవకాశముందన్న విషయం మీరు గుర్తించడం ముదావహం.

    రిప్లయితొలగించండి