16, ఫిబ్రవరి 2011, బుధవారం

చివరి అతిధి

అవును నిజమే
బాల్యం బావుంటుంది
అది సప్తవర్ణాల ఇంద్రధనస్సు కనుక
అది నేల మీద నెలవంక కనుక
ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్ళు
పెరటి చెట్టు ఏకైక జాంపండు కి చేసిన కాకి ఎంగిళ్ళు
మిత్రుడితో ఆడుకున్న వంగుడు దూకుళ్ళు
ఎప్పుడు గుర్తుకొచ్చినా గుండె పట్టని జ్ఞాపకాల చలి నెగళ్లు
అవును నిజం
బాల్యం బావుంటుంది.
అది మంత్రకవాటం తెరచిన వసంత మాసం కనుక
అది చంద్రచాకోరాలు వేచి చూసిన శరత్కాలపు వెన్నెల సందోహం కనుక
***************
అవునవును నువ్వు అన్నదీ నిజమే
యవ్వనం ఇంకా బావుంటుంది.
అది నిండు కొండల మీంచి అమాంతం దూకే జలపాత సంగీతం కనుక
అది రెండు గుండెల గుసగుసల గువ్వలచప్పుడు కనుక
ఆ ఉద్వేగానికి ఆకాశమే హద్దు
ఆనందం మినహా మిగతా భావాలన్నీ రద్దు.
జీవితాన్ని వెలిగించే ప్రేమ మాత్రమె దారి దీపం
యవ్వనం మాత్రమె ఒక వెన్నెల లోయ వెలుతురు శిఖరం
అవునవును నువ్వన్నది నిజంగా నిజమే
యవ్వనం ఇంకా బావుంటుంది
అది చంద్రశీతల జలపాతంలో కవోష్ణ రుధిర కాసారం కనుక
అది సాంద్ర తిమిరారన్యంలో యవ్వనవన కస్తూరీ మృగ సంచారం కనుక
***************
అవును
నువ్వన్నది నిజమే
మనకు తెలీకుండానే మనం పెద్దవాల్లమై పోవడం బాధగా వుంటుంది
వసంతం పూర్తి కాకుండానే గ్రీష్మం వచ్చినందుకు బెంగగా వుంటుంది.
హేమంతం పక్క దులపకముందే శిశిరం పరుగేతుకోచ్చినందుకు కోపంగా వుంటుంది
పున్నమి వెన్నెల పై తనివి తీరకముందే
నిండు అమవసనిశి కప్పేస్తే చెప్పలేనంత దిగులుగాను వుంటుంది
కానీ
మరొకరిని ఆహ్వానించడానికి మనం తప్పుకోవాలి కదా
అంకురం ఆకాశాన్ని కౌగిలిన్చుకోవాలంటే
విత్తనం నేల ఒడిలో ఒధగాల్సిందే కదా
అవును నిజం
మరణం మన ముందుకు, మన ముంగిలికి వచ్చినప్పుడు
తలుపు తీసి సాదరంగా ఆహ్వానిన్చాల్సిందే
మృత్యువు మన ఇంటికి వచ్చే చివరి అతిధి

2 కామెంట్‌లు: