11, మార్చి 2010, గురువారం

నిరీక్షణ

గోడ మీద చిట్టి పాపను చూడగానే

తను ఇలాగే ఉంటుందా అన్నవూహ

నిలువెల్లా పాకింది

గోడ మీద పాల బుగ్గను చూడగానే

తను ఇలాగే ఉంటుందా అన్న వూహ

ఒక్క క్షణం కూడా నిలువనీయలేదు

గోడ మీద పూల కొమ్మని చూడగానే

తను ఇలాగే ఉంటుందా అన్న వూహ

అంతర్లోకాల లోకి దారులు వెతుక్కుంది

పాప కోసం

పాల బుగ్గ కోసం

పూల కొమ్మ కోసం

ఈ నిరీక్షణ

-------------------------- వంశీకృష్ణ

చిన్ని కాన్క

ముని వేళ్ళ తో మురిపెంగా
ఆ పొట్ట మీద స్పర్శించగానే
చిత్ర నిద్రలో శిశువు ప్రాచీన స్మృతులూచే చప్పుడు
అరమోద్పులైన ఆమె కనుల నుండి
ముత్యాల దొంతరలా జాలు వారింది.

ముని పెదవులతో మురిపెంగా
ఆ పొట్ట మీద స్పర్శించగానే
పురా జన్మల పాప పుణ్యాల భారమంతా ఘనీభవించి
ఒక నిండైన ఆకృతి దాల్చి
మార్మిక యోగ భాషని నాలోకి నింపింది.

ముని చూపుల గోరింటతో మురిపెంగా
ఆ పొట్ట మీద స్పర్శించగానే
ఈ చిన్ని పువ్వును కాన్కగా తీసుకోమన్నా అభ్యర్ధన
లోలోపల నుండి బయటికి వచ్చి
నిరుత్తరను చేసింది.

----------------- వంశీకృష్ణ

2, మార్చి 2010, మంగళవారం

మూగ భాష

హిమాలయ పర్వత శిఖరాగ్రంలా గర్వంతో
ఉబ్బెత్తుగా కన్పిస్తున్న
ఆ "గర్భం" మీద తల ఆనించి ........

మొదటిసారి ఒక అలోకిక సంభాషణ విన్నాను
చర్మ సరిహద్దులు దాటి
ఆ సంభాషణ నా లోలోపల నిండి పోయింది

మూసుకున్న చేతులతో గర్భ కుడ్యాన్ని నా చిట్టి పాప
బలంగా తడిమినపుడు
అనుభూతికి అందని అలంకారమేదో
మా ఇరువురి సంభాషణలో వొదిగి పోయింది

వుమ్మ నీటిలో శీర్షాసనం వేసిన
చేపపిల్లలా తను కదలాడినప్పుడు
మా సంభాషణ అంతా నిస్సబ్దమై పోయి
భాష మూగ పోయింది.
--------- వంశీకృష్ణ