1, ఫిబ్రవరి 2018, గురువారం

కవిత్వ ప్రపంచం

దిగంబర కవిత్వం - గురించి 

జీవితం ,ప్రేమ ,కవిత్వం ఎప్పుడూ స్తబ్ధు గా ఉండవు . చలనం వాటి లక్షణం . ఎప్పుడైనా స్తబ్దత అలుముకుంటున్నది అనుకున్నప్పుడు ఎదో ఒక సంఘటనో , శరాఘాతామో ,షాక్ ట్రీట్మెంటో  జరిగి వాటిని గమనాన్ని మారుస్తాయి 

తెలుగు కవిత్వానికి మొదటి షాక్ ట్రీట్మెంట్ ను శ్రీశ్రీ ఇచ్చాడు . గురజాడ వేసిన అభ్యుదయ వారసత్వం నుండి పక్కకి తొలగి ఆత్మాశ్రయ భావకవిత్వం లోకి జారీ పోయి దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రేయసీ పల్లవాధరాలమీదకవిత్వం చెప్పుకుంటూ వస్తున్న కవిలోకానికి శ్రీశ్రీ షాక్ ట్రీట్మెంట్ కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది . అందుకేనేమో శ్రీశ్రీ నెత్తురు , కన్నీళ్లు కలగలసిన కొత్త టానిక్ తయారు చేశాడు అన్నారు విమర్శకులు . మరికొంత మంది అయితే శ్రీశ్రీ కి ముందూ వెనుకా అంతా శూన్యం అనే స్థాయికి వెళ్లిపోయారు . శ్రీశ్రీ ని యుగకర్త అన్నారు . శ్రీశ్రీ ని తమ భుజాల మీద పెద్దన ని పల్లకి లో ఊరేగించిన శ్రీకృష్ణ దేవరాయలు లాగా ఊరేగించారు . అందుకేనేమో శ్రీశ్రీ 1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే 1930 నుండి తెలుగు కవిత్వాన్ని నేను నడిపిస్తున్నాను అన్నారు . 

శ్రీశ్రీ ఇచ్చింది షాక్ ట్రీటుమెంట్ కానేకాదు . అది ఒక పెద్ద కుదుపు మాత్రమే . శ్రీశ్రీ కవిత్వ సారాన్ని తప్ప రూపాన్ని మార్చలేదు . 1930 నుండి తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీ నడిపించాడు అనడం కూడా తప్పే . ఈ విషయం లో మరింత వివరాలు కావాలంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సమాలోచన చూడవచ్చు .కానీ తెలుగు కవిత్వ విమర్శకులు శ్రీశ్రీ ని యుగకర్త కా గుర్తించారు . సి , నారాయణ రెడ్డి కొంత నయం . ఆయన తన ఆధునికాంధ్ర కవిత్వం . సంప్రదాయం , ప్రయోగం అనే తన సిద్ధాంత గ్రంధం లో శ్రీశ్రీ కి . రాయప్రోలు కి సమానంగా యుగకర్త్రుత్వం కల్పించారు 

తెలుగు కవిత్వానికి మొదటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది పఠాభి . ఆయన వచన పద్యాలనే దుడ్డుకర్ర లతో పద్యాల నడుము విరగగొడతాను అన్నారు . ఆయన భాష వేరు . భావం వేరు . కానీ ఆయనను కేవలం ప్రయోగవాదిగానే  మనం గుర్తించాము . శ్రీశ్రీ సమకాలికుడే  అయిన  ఆరుద్రనీ మనం నిర్లక్ష్యం చేశాము . అయితే పఠాభి  సినిమాలలోకి , ఆరుద్ర పరిశోధన లోకి వెళ్లిపోవడం కవులు గా వాళ్లకు వాళ్ళే చేసుకున్న ద్రోహం . 

తెలుగు కవిత్వానికి రెండో షాక్ ట్రీట్మెంట్ దిగంబర కవుల రూపం లో వచ్చింది . దిగంబర కవుల రాకకి ముందున్న పూర్వరంగాన్ని శ్రీశ్రీ ఇలా వివరిస్తున్నాడు . 
" ఎటు తిరిగినా ఎదో నిస్త్రాణ . ఎదో నిస్సత్తువ . ఎదో నిస్పృహ . ఫౌల్ చేసి , గోల్ చేసిన ప్రతీపశక్తులు విజృంభిస్తున్నాయి . ఐదారేళ్లకు పూర్వం అభ్యుదయ రచయితల సభలలో పువ్వుల దండలను వేయించుకుని పెళ్లి కొడుకులు లాగా ఊరేగిన మిత్రులు కొందరు ఈనాడు క్షుద్ర ప్రయోజనాల కోసం మరీచికల వెంట పడి ఉద్యమ విచ్ఛిత్తికి  దారి తీస్తున్నారు . సరి అయిన నేతృత్వం లోపించడం వలన యువతరం లో కూడా ప్రమాదభరితమైన ఒకానొక నిరుత్సాహ , నిరాశా ధోరణి తలయెత్తుతున్న సూచనలు కనపడుతున్నాయి " 1
1955 నుండి 1964 నుండి  తెలుగు కవిత్వం లో సుమారు దశాబ్దం పాటు తెలుగు కవిత్వం ఒక నిర్ణయం రాహిత్యం , ఒక ఉద్యమ స్ఫూర్తి , లోపించాయి . స్వాతంత్య్రం  ఉద్యమ సందర్భం గా చెప్పుకున్న సంకల్పం లో ఏ ఒక్కటీ నెరవేరలేదు . నెహ్రు సామ్యవాద దృష్టి మసక బారుతున్న స్థితి . ధనిక పేద అంతరాల తగ్గింపుకు కృషి చేయవలసిన రాజకీయ నాయకత్వం తమ తమ స్వార్ధ ప్రయోజనాలకు పెద్ద పీట  వేసి , స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి సమష్టి నుండి వ్యష్టి వైపు మళ్లుతున్న విషాదం నలుదిశలా అలుముకుంది . తెలుగు మేధావరణం లో ఒక నిస్పృహ . 1955 నాటికే ఈ స్థితి గుర్తించిన శ్రీశ్రీ 1930 నుండీ తెలుగు కవిత్వాన్ని తానే  నడిపించాను అని చెప్పుకున్న శ్రీశ్రీ తాను చేయవలసిన పనిని మరచిపోయాడు . అభ్యుదయ కవుల లో చాలా భాగం సినిమా  రంగం వైపు వెళ్లి పోగా శ్రీశ్రీ కూడా సినిమా  రంగం లో కాళ్ళూనుకుంటున్న స్థితి .నాగార్జున సాగరం అని నారాయణ రెడ్డి (1955) విద్వాన్ విశ్వం పెన్నేటిపాట (1956) కె వి రమణారెడ్డి అంగారవల్లరి (1959) వచ్చినా ఆ కవులు ఎవరూ యువతరం మీద గొప్ప ప్రభావాన్ని చూపగల కవులు కారు శ్రీశ్రీ తో పోలిస్తే 

ఈ పూర్వ రంగం నుండి దిగంబర కవులు తమ గొంతు విప్పారు .ఈ నిరాశామయ స్థితి నుండి దిగంబర కవులు తెలుగు కవిత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు .  వాళ్ళు ఆరుగురు . తమతమ స్వీయ నామాలను వదులుకుని కొత్త పేర్లు పెట్టుకుని  మరీ కవిత్వ లోకం లోకి కొత్తగా ప్రవేశించారు . ఆ ఆరుగురు నగ్నముని , జ్వాలాముఖి, చెరబండ రాజు ,,నిఖిలేశ్వర్,భైరవయ్య ,మహాస్వప్న . . వీళ్ళందరూ ఒకే తాత్విక దృక్పధం కలిగిన కవులు కారు . కానీ వీళ్లందరినీ కలిపిన  సామాన్య అంశం సమాజం పట్ల బాధ్యత . ఒక నిస్పృహ లో ననుండి జనించిన కసి 

"అభ్యుదయ కవీ నల్లమందు తిని నిద్రపోయావు 
నయాగరా జలపాతం లో 
దూకలేక పోయిన అన్నయ్యా 
గుడ్ బై ! మీ కందరికీ  సలామ్ వాలేకం 
వచనం లేదు 
కవిత్వం అంతకంటే లేదు    ( నిఖిలేశ్వర్ -- ఆత్మయోని నుండి )

అని అభ్యుదయ కవుల స్తబ్దతను నల్లమందు తినడం తో సరిగ్గానే పోల్చగలిగారు . అప్పటికే వచన కవిత గా కవిత్వం స్థిరీకరించబడినా దిగంబరకవులు తమ కవిత్వాన్ని వచన కవిత అనడానికి ఇష్టపడలేదు . వాటిని దిక్  లు అన్నారు . 
కలాలు ,కాగితాలు సర్దుకోండి 
లా బుక్కులలో నా సందేహాలు రాసుకోండి 
న్యాయానికి దేశాలేమిటి ?, ఎల్లలేమిటి ?
మనిషీ, రక్తం ,ప్రాణం ముఖ్యం 
లింగబేధాలు ,వాదాలు తప్పితే 
మందిర్ ,మస్జీద్ చర్చ్  
మతాధికారులు మతాలూ ఎందుకు 
ఆకలి , కామం, కలలు ,కన్నీళ్లు 
మనిషి లోని మర్మజ్ఞానమంతా ఒక్కటే 
అమ్మ ఎవరైతేనేం ? చనుబాలు తీపంతా ఒక్కటే 
బిక్కమొఖాలతో చూస్తారేం 
పిచ్చివాడి గా కేసు పుటప్ చేయండి 
ననెక్కనివ్వండి  బోను                      (   చెరబండ రాజు -నన్నెక్కనివ్వండి బోను )

అమ్మ ఎవరితేనేమి ? చనుబాలు తీపంతా ఒక్కటే అన్న ఎరుక న దిగంబర కవులు తమ మొదటి సంపుటిలోనే  ప్రకటించారు . 

కలియుగం రేడియోగ్రామ్ లో 
గిరగిరా తిరుగుతున్న క్రీ .శ  ఇరవయ్యో శతాబ్దం మీద పిన్నునై 
మానవత రెండు కళ్ళు మూసుకుపోయినప్పుడు 
విప్పుకుంటున్న మూడో కన్నునై 
కాలం వాయులీనం మీద కమాను  నై 
చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై 
నేను వస్తున్నాను దిగంబర కవిని 
రాత్రి ఉదయిస్తున్న రవిని                 (  మహాస్వప్న -  గ్లానిర్భవతి భారత  ))

దిగంబర కవులు రాత్రి ఉదయిస్తున్న రవి అనడం ద్వారా నలుదిశలా అలుముకున్న చీకటిని దృశ్యమానం చేస్తూనే అభ్యుదయ కవుల స్పర్శా రాహిత్యాన్ని ఎట్టి చూపుతున్నారు . దిగంబర కవిత్వ లక్ష్యాన్నీ చెపుతున్నారు . 

పెద్ద మనిషిగా  చారల పైజామా  కోర్కెల కింద 
నిన్ను నువ్వు 24 గంటలు దాచుకుంటూ 
అవమానాలని పూల హారాలుగా ధరిస్తూ 
వెధవా అని ప్రపంచమంటే పళ్ళికిలిస్తూ 
నీలో పొంచిఉన్న అవకాశం బెబ్బులికి  కొత్త రంగు వేసుకుంటూ 
కప్పలా బెకబెక మంటున్న 
మేకలా మే మే  అంటున్న 
నీ ఆషాయపు కీచురాయి గొంతు వింటే 
మువ్వెవరో  నీకే  తెలియని ఈ సంత లో నువ్వంటే 
నాకు జాలి                                (    నగ్నముని -   సుఖ రోగి  )
కవిని సుఖరోగి అనడం తీవ్ర నిరసన ఉన్నప్పటికీ అవి భద్రజీవులైన కవుల అహాన్ని ఖచ్చితంగా దెబ్బ తీసి ఉంటుంది . చివరగా నిన్ను ప్రేమిస్తాను అన్నా కవి పట్టించుకోలేదేమో . 

స్వార్ధ పరత్వపు వేశ్యా రతి లో 
ఆనంద పరబ్రహ్మపు స్వరూపాన్ని చూస్తూనే 
అసలు కర్తవ్యాన్ని వదిలేస్తున్నాము 
అజ్ఞానపు తిమిరం నమిలేస్తున్నాం 

సంకుచితత్వాని మనమంతా 
సాంప్రదాయ బద్దం చేసుకున్నాం 
కాబట్టే మనకింకా అర్ధం కానిది 
సర్వమానవ కళ్యాణం          (జ్వాలాముఖి  -అవలోకన )

సర్వ మానవ కళ్యాణం గురించిన స్పృహ కోల్పోయిన జాతి గురించి వ్యగ్యంగా , వాచ్యంగా సంకుచితత్వాన్ని సంప్రదాయబద్దం చేసుకున్నాం అంటున్నాడు . 

మాతృగర్భం లో మాటలు నేర్చుకున్న శిశువు 
పెట్టిన తోలి కేకలా వచ్చాను 
ఆఁకొన్న హరీంద్ర గర్జన లా 
మేఘాల వికటాట్టహాసాలు చీల్చుకుని 
ముందుకురికిన మెరుపులా 
జడివానలా 
పెనుగాలిలా 
సంధ్య రేపినం నెత్తుటి మంటలా 
మధ్యాహ్నం మింట నిండిన మార్తాన్డునిలా 
కన్  చెదురుగా -దిల్ బెదురుగా 
కవి లేఖిని లో కదం తొక్కుతూ వచ్చాను 
కవిత్వం లోకి చొచ్చుకుంటూ వచ్చాను       (భైరవయ్య  -- అగ్ని ప్రవేశం )
సారరాహిత్యం లో కొట్టుమిట్టాడుతున్న కవిత్వానికి దిగంబర కవులు అగ్ని పరీక్ష పెడుతున్నారా ?దిగంబర కవులను మనం సరిగ్గా అర్ధం చేసుకున్నామా ? వాళ్ళను అరిష డ్వర్గాలు  లాగా వాళ్ళు ఆరుగు అన్నాము . వాళ్ళది అరాచకం అన్నాము . అది కవిత్వం కానే కాదు పొమ్మన్నాము /

" తెలుగు కవిత్వం లో హేయ వస్తు  కవిత్వం  మొదలైయింది దిగంబర కవిత్వం తో "2అన్నారు వెల్చేరు నారాయణ రావు గారు . సభ్య సమాజం లో హేయ వస్తువు ఉంటుందా ? దిగంబరుల ప్రవేశం నాటికి సమాజం హేయ స్థితికి దిగజారిందా లేదా అన్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే దిగంబర కవిత్వాన్ని హేయ వాస్తు కవిత్వం అనడం దారుణం . 
 " దిగంబర కవులు సాహితీ దృక్పధాలు మార్చేశారు . ఇది దిగంబర కవులే చెప్పుకోవలసి రావడం ఘోరం . దిగంబర కవులు వచ్చేంతవరకు సాహితి ,ముఖ్యంగా కవితానుశీలన రూప ప్రధానం గా జరుగుతూ వస్తున్నది . కవిత్వం లో రూపం , వస్తువు ముఖ్యం . రూపానికి ప్రాధాన్యత ఇస్తే అలంకార శాస్త్ర పరిధిలోకి వెళుతుంది . వస్తువుకి ప్రాధాన్యం ఇస్తే కవిత్వం సృజనాత్మకంగా అభివృద్ధి చెందుతుంది వస్తువు రూపాన్ని వెతుక్కుని వెంట తీసుకుని వస్తుంది . రూపం వస్తువుని తప్పకుండా మార్చుకోవాలని ఏమీ లేదు . రూప ప్రాధాన్యత వల్ల  యాంత్రికత కొనసాగుతుంది.  వస్తువు  మారడం వలన రూపం సృజనాత్మకం అవుతుంది , ఈ సరళి లో మన సాహితీ దృక్పధం మారక పోవడం వలన కొత్త వస్తువును ప్రవేశ పెట్టి రూపాన్ని సృజనాత్మకం చేసి సమాజ బోధకులుగా నిలచిన వీర బ్రహ్మం , వేమన ,జాషువా, గురజాడ , దిగంబర కవులు పడితే సిద్ధాంతాల ,శాస్త్రాల కావాలనే ఉండి  పోవలసి  వచ్చింది . దిగంబర కవులు వస్తువు కి ప్రాధాన్యత ఇచ్చి రూపాన్ని నిర్దిష్టంచేయడం వలన అప్పటివరకూ సాదా సీదా వచన అభివ్యక్తీకరణ గా ఉండి పోయిన వచన కవిత్వం ఉద్యమాల వాహికగా ఉండగలదని నిరూపించారు "3 
ఈ అభిప్రాయం నగ్నమునిది . అయితే ఈ అభిప్రాయం పాక్షిక సత్యమేనేమో . దిగంబర కవులు ఆ తరువాత వచ్చిన విప్లవోద్యమం లో పాట దే  ప్రధాన భూమిక . నిఖిలేశ్వర్ , జ్వాలాముఖి ,నగ్నముని కవిత్వం రాస్తే చెరబండ రాజు పాటవైపు  వెళ్లిపోయారు గద్దర్ విప్లవోద్యమానికి , అందెశ్రీ , గోరటి వెంకన్న , రసమయి బాలకిషన్ , తెలంగాణా ఉద్యమానికి తమ పాట  ద్వారా చేసిన దోహదం తక్కువేమీ కాదు . బహుశా ఏఅవే  ప్రధానమేమో 
దిగంబర కవిత్వం మీద జరగవలసినంత చర్చ జరగనే  లేదు . దాన్ని కేవలం అశ్లీలం అనే దృష్టి తో కొట్టి పారేశారు . అయితే వెల్చేరు నారాయణ రావు గారు మాత్రం తన సిద్ధాంత గ్రంధం అశ్లీలం మీద కొంత విపుల చర్చే చేశారు . అశ్లీలత , గ్రామ్యత , అసభ్యత  దోషాలని దండి మొదలుకుని మూర్తి కవి వరకు , అభినవగుప్తుడు మొదలు అప్పకవి వరకు వాటిని అనిత్య దోషాలుగా పరిగణించారు . అంటే ప్రకారణాని బట్టి , ఏది అశ్లీలమో , ఏది కాదో ఇర్ణయించవలసి వుంటుంది. కానీ దానంతట అదే ఏదీ అశ్లీల పదం కానీ , అశ్లీలార్ధమ్ కానీ కాదు . లైంగిక సంబంధం అయినంత మాత్రాన అశ్లీలం కానక్కర లేదు . 
కమలాకుచ చూచుక కుంకుమతో 
నియతారుని తాతుల  నీల తనో 
అన్న వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకం లో ఎవరూ అశ్లీలం చూడరు . ఎందుకంటే అది భక్తి సందర్భం కనుక . 
యజమాన ప్రమాదావిక స్వరభాగన్యస్థాశ్వ దీర్ఘస్మర 
ధ్వజదండబగు నశ్వమేధ ముఖ తంత్రంబు నిరీక్షించి 

అని శ్రీనాధుడు  రాసింది అశ్లీలం కాదు వేదం విహిత కర్మను వర్ణించేది కనుక 4
దిగంబర కవిత్వం లో ప్రధాన పాత్ర ధారులైన ఆరుగురు కవుల గురించి తరువాతి కవిత్వప్రపంచ వ్యాసాలలో విపులంగా 
వంశీకృష్ణ 
9573427422
-------------------------------------------------------------------------------------------------------------
1: ఆంధ్రా అభ్యుదయ రచయతలు ఐదవ మహాసభ లో అధ్యక్షుడిగా శ్రీశ్రీ ప్రసంగం . 1955 జులై 30,31 తేదీలు .
2 తెలుగు లో కవితా విప్లవాల స్వరూపం  - వెల్చేరు నారాయణ రావు 
3  పఠాభి  ప్రతిభా వైజయంతి లో నగ్నముని వ్యాసం . దిగంబర కవిత్వం నుండి దళిత యుగం దాకా 
4 తెలుగులో కవితా విప్లవాల స్వరూపం  -వెల్చేరు 

3 వ్యాఖ్యలు:

GKR CHANNEL చెప్పారు...

good morning
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Picture Box చెప్పారు...

good information blog
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Picture Box చెప్పారు...

nice article
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి