27, మార్చి 2011, ఆదివారం

ఎంత కన్నీరోలికితే రెండు దేహాలు, ఒకటే ఆత్మ నిన్నా మొన్నటి పాతకాలపు మురికి మాట ఒక దేహం లో ఇమడని రెండు ఆత్మలు ఇవ్వాల్టి సరి కొత్త తాజా తాజా ఉద్యమాల పాట రెండు కళ్ళు ఒక దానిని మరొకటి చూసుకోలేవు రెండు దేహాలు ఒక దాని తో మరొకటి సంగమించ లేవు తరచు రజ్జూ సర్ప భ్రాంతి కి గురవుతూ వుంటాయి సర్పం కాటేస్తుందని తెలిసీ కౌగలించు కుంటాయి ముందు పూల గుత్తి తో పలకరించి వెనుక విచ్చు కత్తి తో సంహరిస్తుందనితెలిసీ పై పై న ప్రేమలు నటిస్తూ వుంటాయి ఎవరి విగ్రహాలకు వాళ్లే పూల మాలలు వేసుకుని ఎవరి ఆత్మలకు వాళ్ళే కొత్త శరీరాలని ఇచ్చుకుని ఎంత కాలమైనా సహజీవన మోసం చెస్తూనె వుంటాయి ఎవరో ఒకరిని ద్వేషించానిదే మరొకరిని ప్రేమించ లేమా అన్నాడొకడు ద్వేషించ డానికె సమయం సరిపోదే ప్రేమించ డానికి తీరిక ఎక్కడిదని వా పోతాడొకడు ప్రేమల్లేని, ద్వేషాల్లేని శూన్యాకాశ శిధిలాల కింద బైరాగి ఒకడు శరీరాన్ని అంతటిని ఒక స్వరం గా మల్చుకుని పాడుతుంటే లోక మంతా ... చెవిటిదై పోతుంది చీకటిలో నల్ల పిల్లిని వెతికే అన్ధురాలవుతుంది నెమలి కంట ఎంత కన్నీరోలికితే ఒక్క మేఘం వర్షిస్తుంది ? శత సహస్ర దళ వికశిత జీవితాలేన్ని ఆత్మ హత్యించుకుంటే ఒక్క రాష్ట్రం సిద్దిస్తుంది ?? ........................................................ వంశీ కృష్ణ

11, మార్చి 2011, శుక్రవారం

ఆ ఒక్కటి లేక పోతే ......

ఆ ఒక్కటి లేక పోతే ......


ఇవాళ కాస్త ఆనందం గాను మరికొంత బాధగాను వుంది. మిలియన్ మార్చ్ విజయవంతం అయినందుకు రవ్వంత గోరంత కొండంత ఆనందము, తెలుగు జాతి కి ప్రాతః స్మరనీయులైన మహనీయుల విగ్రహాల కూల్చివేత పట్ల అంతే బాధగాను వుంది. మనోభావాల గురించి మాట్లాడే వాళ్ళు మరొకరి మనోభావాలను పట్టించుకోక పోవడం పట్ల చెడ్డ చిరాకుగాను వుంది.

3, మార్చి 2011, గురువారం

సంధ్యా సందర్భం

సంధ్యా సందర్భం

ఇన్ని పగల్లెందుకు? ఇన్ని రాత్రులెందుకు ? ఇన్ని దుఖాశ్రువులెందుకు? ఇన్ని చిర్నవ్వు విచ్చుకత్తులేందుకు? ఇన్ని మతాలెందుకు? ఇన్ని మమతానుబందాలెందుకు? ఇన్ని సంధ్యలెందుకు ? ఇన్ని సందర్భాలెందుకు? జారిపోయిన నీటి పడవలాంటి ప్రేమలెందుకు? పారిపోయిన శ్వేత వెన్నెల లాంటి ద్వేషా లెందుకు? రంగు మార్చిన రాతి చక్రం లాంటి వేదన లెందుకు? రాత్రి వేళ భయం భయం గా ఒదిగి పోయే పల్లె లాంటి పరిమళా లెందుకు? నవ్వలేని నక్షత్రాలెందుకు? కుంకుడు గిన్జల్లాంటి అనుభవా లెందుకు? వరద వచ్చి వెళ్ళాక , రైలు వచ్చి వెళ్ళాక ఆత్మ లేని శరీరం లా బోసి పోయే వరిపైరు లాంటి , ఐదో నెంబర్ ప్లాట్ఫారం లాంటి హృదయ శకలాలేందుకు? చీకటంతా రంగరించి ప్రియురాలి కంటి కాటుకలా చేసే భావుక హృదయ సంఘర్షణ లెందుకు? ఇరు సంధ్యల నడుమ నలిగి పోయే జీవితాలేందుకు? అసుర గీతమై పోయిన వికలాంగ భాష ఎందుకు? అక్షరాలు ఎందుకు? ఆకర్షణలు ఎందుకు? జాతుల మధ్య సంఘర్షణ లో జనించే ఉద్యమాలు ఎందుకు? మొండి చెట్టుకు పూలై పూచే వైఫల్యా లెందుకు? స్వరం తెగిన గొంతులో మూగ గీతాలు ఎందుకు? మోవి పైన చిగురించిన మాటల పువ్వు లెందుకు? వెన్ను పైన నిలువ లేని వక్తిత్వ చాయలు ఎందుకు? ఇన్ని సంధ్య లెందుకు? ఇన్ని సందర్భాలెందుకు? ఒక మనిషి మరొక మనిషి లో ప్రవహించడానికి ఇన్ని వైరుధ్యాలు ఎందుకు? ఇన్ని వైమనస్యాలు ఎందుకు? (వంశీ కృష్ణ పాత కవిత్వ సంపుటి డబ్బు పిట్ట నుండి )