21, అక్టోబర్ 2009, బుధవారం

మల్లెపూల సౌరభం ...

ఒక మల్లెపూల సౌరభానికీ,
ఒక మంచుపూల సంగీతానికి,
గది నిండా అల్లుకున్న ఆగరు ధూప ధ్యానానికి,
హృది నిండా దాగి ఉన్న మనుష స్పర్సా మాధుర్యానికి,
గురుదాత్ ప్యాసానో,
శాంతారాం శకుంతల నో ,
చూసి మనసంతా ఒక అలౌకిక అవ్యక్త మాధుర్యాన్ని నింపుకుని
ఎవరితోనూ ఏమాట మాట్లాడక రవ్వంత సడి లేని
రసరమ్య సన్నజాజి పందిరి రాల్చిన సన్నజాజి మొగ్గల చప్పుడు లాగా
లేత లేత ఇంద్రధనుసు లోంచి రాలిపడిన హర్షపులాకాంకిత వర్ష బిందువులు గా
మొహమాటాల మొగ్గలు విప్పారినప్పుడు
" I would save a little Love for my self" అనుకుంటూ జేవితం గడపాలానిపిస్తుంది.


వంశీ ఏమిటి ఇవ్వాళ అక్షరం అక్షరం కవిత్యమై కలవరిస్తున్నాడు అనుకుంటున్నావా? మరేం లేదు. గత మూడు రోజుల నుండి ఏదో ఒకటి రాయాలని తాపత్రయం. ఎం రాయాలో తెలియని అస్పష్ఠత. ఏం రాస్తే, ఏం ఉంది అనే నిరాసక్తత. ఇవ్వాళ్లైనా రాసావా? ఇవ్వాలైనా రాసావా? అనే నీ ప్రశ్నలకి రాయలేదు అనే నెగటివ్ జవాబు చెప్పలేని ఆయిష్ఠత కలగలసి ఇలా...... నిజం గా జీవితం అంత రసవంతంగా ఉంటే ఎంత బావుంటుంది. గరిక పచ్చ మైదానాల్లోనూ, వెదురు గీత వానల్లోనూ, సముద్రతీర ప్రాంతాల్లోనూ, మన ఉనికికి ఏ ప్రాధాన్యము లేని చోట ప్రకృతి లో ప్రకృతిలా కలిసిపోవడము.. ఆ అనుభూతి సాంద్రాన్ని గుండెల నిండా నింపుకుని నిత్య జీవన వ్యాపారం లో మునిగి పోవడం, ఒక అమూర్తా వేదన నుండి తప్పించుకోవడానికి పోనీ జయించడానికి ఎప్పటికైనా మనిషి ప్రకృతిని ఆశ్రయించాల్సిందే కదా.


మనుషులంతా ఎందుకని ఇంత ద్వంద్వం గా ఉంటారో తెలీక దాన్ని తెలుసుకోవాలనే అన్వేషణ లోనే సమస్త సాహిత్యం పుట్టిందేమో. నిజానికి ప్రేమని మించిన ఔషధం ఏది ప్రపంచం లో లేదు సర్వకాల సర్వావస్థల యందు ప్రేమ మానసిక స్వాంతన కలిగించే అద్భుత రసాయనం. మార్కెట్ శక్తులు, గ్లోబల్ ప్రపంచం లో ప్రేమను పరాధీన చేశాయి. లేదు ఒక వినిమయ వస్తువుగా మార్చేశాయి. గుండెలోపల దాచుకోవలసిన ఒక అనుభూతిని , ఒక స్పర్శానురాగాన్ని కరెన్సీ నోట్ల వెలుగులో ప్రదీప్తమానం చెయ్యాలని మార్కెట్ శక్తులు ప్రయత్నం చేస్తాయి . అందుకే ఇంత వైరుధ్యం.


“చిరునవ్వుల వరమిస్తావా చితి లోంచి లేచి వస్తాను మరుజన్మకు కరుణిస్తావా? ఈ క్షణమే మరణిస్తాను.” అంటాడు ఒక తెలుగు కవి.

"మరణం అంటే భయము, బెంగ లేదు. ఆ మరణం ప్రేమ గురించి కాక మరెందుకో ఐతే మాత్రం బాధ పడతాను" అంటాడు మర్కయూజ్.

"మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే స్వర్గము , అదే స్వప్నము " అంటాడు శ్రీ శ్రీ.

"సెలయేరు ఎందుకు ప్రవహిస్తుందో, కుసుమం ఎందుకు పరిమళాన్ని వెదజల్లుతుందో అందుకే నా మనసు నిన్ను ప్రేమిస్తుంది" అంటూ దేవులపల్లి చెప్పినా


ఎప్పటికప్పుడు ప్రేమ ఒక అద్భుతమే కదా.


నీ
వంశీ