1, ఫిబ్రవరి 2018, గురువారం

కవిత్వ ప్రపంచం

అరచేతిలో అగ్ని కణం 

మనిషి స్వతంత్రుడిగా జన్మించి ప్రతి చోటా సంకెళ్ళ తో బంధించబడి వున్నాడు అన్నాడు రూసో . జీవితం ఒకటి జైళ్లు అనేకం అన్నాడు శివసాగర్ . ఒకటి తత్వశాస్త్రం . మరొకటి కవిత్వం . నిజానికి రెండింటికీ పెద్ద తేడా లేదు . అందుకే జీవితం ఒక చెర అనుకున్నాడేమో బద్దం భాస్కర రెడ్డి దిగంబర కవిగా అవతరించడానికి తన పేరును చెరబండ రాజు అని పెట్టుకున్నాడు . చెర అంటే జైలు అని అర్ధం . చెర వీడని మానవ జీవన విముక్తి కై నిరంతర అక్షర యుద్ద్ధం చేశాడు చెరబండ రాజు . 

ఖమ్మం కళాశాలలో చదువుకునేటప్పుడు మేము కాలేజీ గోడల మీద రాసిన నినాదాలలో  మాకు బాగా ఇష్టమైన నినాదం  విప్లవాల యుగం మనది . విప్లవిస్తే జయం మనది  అన్నది . నూతన ప్రజాస్వామిక విప్లవమే ఖమ్మం గుమ్మం లోనే  ఉన్నది  అన్నంత నిబద్దత గోడల మీద ఆ నినాదాలు రాసేటప్పుడు మాకు ఉండేది . ఆ నినాదం చాలా కాలం శ్రీశ్రీ డి అనుకునేవాళ్లం మేము . అది చెరబండ రాజు కోర్ట్  లో ఇచ్చిన నినాదం అని తెలిసాక చెరబండ రాజు అంటే ఇష్టం పెరిగింది  ఒక్కసారిగా . ఆ తరువాత చెరబండరాజు కవిత్వం , పాటలు మాకు హృదయగతం అయినాయి . 

 దిగంబర కవులు ఆరుగురి లో చెరబండరాజు ది  ప్రత్యేకమైన పంధా . కొంత సున్నితత్వమూ , పట్టలేనంత సామాజిక స్పృహ , కావలసినంత ఆగ్రహమూ చెరబండరాజు సొంతం . కార్య కారణ సంబంధాలపట్ల స్పష్టమైన అవగాహన , గమ్యమే కాదు గమనం పట్ల కూడా స్పష్టత చెరబండ రాజు ను మిగతా దిగంబర కవుల కంటే భిన్నం గా చూపిస్తాయి . 

ఒకప్పటి భారత స్వాతంత్ర్య సంగ్రామానికి  ఊపిరులు ఊదిన గీతం  వందేమాతరం . బంకించంద్ర ఛటర్జీ ఆనంద మఠ్  లో తొలిసారి  కనిపించిన వందేమాతరం ఆ తరువాత జాతి మొత్తాన్ని ముందుకునడిపించిన తారక మంత్రం అయింది . " సుజలాం , సుఫలాం , మలయజ శీతలాం . సస్యశ్యామలం , శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం ,సుమధుర  భాషిణీ " అంటూ భరత మాతను  కీర్తిస్తూ ఒక ఆదర్శాన్ని , ఒక మనోల్లాస  దృశ్యాన్ని ఆహ్లాదకరం గా చిత్రిస్తుంది వందేమాతరం . కానీ స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల కాలం లోనే ఆ సుందర స్వప్నం కరగి పోయింది . భరతమాత పెట్టుకున్న కనుల కాటుక కరిగి నీరై చెంపల మీద కన్నీటి చారికలుగా మిగిలినయి . అంతటా ఒక అసహనం . లోలోపల గూడు కట్టుకున్న ఆగ్రహం . బయటకు వెలువరించలేని , లోలోపల నిలువరించలేని కసి . వీటన్నిటినీ దృష్టి లో పెట్టుకుని చెరబండ రాజు 

ఓ నా ప్రియమైన మాతృ  దేశమా
తల్లివి తండ్రివి  దైవానివి  నీవేనమ్మా 
దుండగలతో పక్క మీద కులుకుతున్న శీలం నీది 
అంతర్జాతీయ విఫణి లో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది 
సంపన్నుల చేతిలో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది 
ఊసినా , దుమ్మెత్తిపోసినా చలనం లేని మైకం నీది 
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న 
ఎలుకలనీ , పందికొక్కులనీ భరిస్తూ నుచున్న "భారతి" వమ్మా 
నోటి కందని సస్యశ్యామల  సీమవమ్మా 
వందేమాతరం , వందేమాతరం 

 తన ఆగ్రహాన్ని ప్రకటించాడు . ఐదు దశాబ్దాల క్రితం రాసిన ఈ కవిత కి నేటికీ ప్రాసంగికత వుంది . లిబరలైజేషన్ , ప్రైవేటైజేషన్ , గ్లోబలైజేషన్ విధానాలతో ప్రపంచమొక గ్రామం గా మారిపోయినాక  బహుళ జాతి కంపెనీలకి లాకులు ఎత్తేసినాక  ,ఆ కంపెనీలన్నీ మిక్  వాయువులను వదిలి  మన దేశ ప్రజలనే సర్వ నాశనం చేసినాక అంగాంగం తాకట్టు అని కవి పడిన వేదనకి అర్ధం తెలుస్తూ వుంది . ఇప్పటికీ ప్రత్యేక విమానాలలో దేశదేశాలు  రెండు నెలలకోసారి తెగ తిరుగుతూ పెట్టుబడులు పెట్టమని  పెట్టుబడిదారులను అన్వేషిస్తున్న రాజకీయులను చూస్తుంటే నోటి కందని సస్యశ్యామల  సీమవమ్మా అంటూ కవి గొంతు లో పలికిన జీర  గుండెలని పట్టేస్తుంది , హృదయం ఉంటే  .

 చెరబండ రాజు వందేమాతరం రాసిన మరో ముప్పయ్ ఏళ్ళకి  వందేమాతరం సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి  కొంత మర్యాదగా  " మలయజ శీతల పద కోమల భావన బాగున్నా , కంటి కంటి లో తెలియని మంట   రగులుతున్నది . తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది . శుభ్రజ్యోత్స్నాపులకిత సురుచిర యామినుల లోన రంగు రంగుల చీకటి గిరాకీ పెరుగుతున్నది . ఫుల్లకుసుమిత ద్రుమదళ  వల్లికామతల్లికలకు  చిదిమివేసినా వదలని చీడ అంటుకున్నది . వందేమాతర గీతం వరస మారుతున్నది " అంటూ మరో కొత్త వందేమాతర గీతం రాశారు . 

రెండు గీతాల వెనుక వున్న  ఆవేదన ఒకటే . ఆగ్రహం ఒకటే . భరించలేకుండా ఉన్న  ఉక్కపోత కూడా ఒకటే . చెరబండ రాజు ఆగ్రహం ఒకతరం యువతరాన్ని మొత్తాన్ని కదిలించింది . 

కన్నీళ్లేనా పెట్టుకునేది  నీలో నీ తరం ఇంకేమీ లేదా ?
దారుణాతి దారుణం దారుణం గా దారపు పోగుల్లా 
తెగిపడుతున్న పచ్చని చెట్ల ప్రాణాలను చూస్తూ 
నిర్లిప్తంగా నించోటానికేనా 
ఏ  సరిహద్దుల శాసన సర్పాలు 
నీ పాదాలని బంధిస్తున్నాయి 
ఏ శిఖండీ ప్రభుత్వాలు 
నీ చేతులని వంచిస్తున్నాయి 
ఏ  భయ సముద్ర తిమిగలాలు 
నీ శాంతి నౌకలని మింగేస్తున్నాయి 
ధనలోభానికి పురుగులు మేసే 
ఏ  వార్తాపత్రికలు 
నీ రక్తాక్షరాలని విరిచేస్తున్నాయి 
కన్నీళ్లేనా పెట్టుకునేది  నీలో నీ తరం ఇంకేమీ లేదా  

అని చెరబండ రాజు అడిగితే అప్పటి యువతరం పదం పదం కదిపి నడిచింది . శ్రీశ్రీ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని యువతరం లో ఒక పార్శ్వాన్ని నిందించి కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అంటూ మరో పార్శ్వాన్ని స్వాగతించినా చెరబండ రాజు నీలో నీ తరం లో ఇంకేమీ లేదా అని ప్రశ్నించినా అంతర్గతంగా ఉన్న  తాత్వికత ఒక్కటే 
దేవరకొండ బాల గంగాధర  తిలక్ "  దేవుడా  రక్షించు నా దేశాన్ని ! పతితుల నుండి , పవిత్రులనుండి నీతుల  రెండు నాలుకలు సాచే  నిర్హేతుక కృపా సర్పాలనుండి " అంటూ అమృతం కురిసిన రాత్రి లో ప్రార్ధించాడు . చెరబండ రాజు జగదుగురువులు  వస్తున్నారు లో 

పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు 
ధనవంతుల మేడలలో  తప్ప పూరిగుడిసెల  ఊసెత్తరు 
కాళ్ళుండీ  కుంటివాళ్ళు 
మనుషుల భుజాలని తప్ప ఇంకేమీ ఎక్కరు 
కాషాయాంబరాలు మానరు 
ఆధ్యాత్మిక చింతన పేరా 
నవీన పతివ్రతలని పావనం చేయందే వదలరు 
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు 
బతుకంతా మోసం తో రసరాట్టులు 
జనాన్నీ జాతి నరనరాన్నీ  మతమౌధ్యాన్నీ తీర్చి తీర్చి 
వయసులో నానా పాయసాలు మరిగి మరిగి 
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలకట్టుల బాబాలే 
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాములార్లే 
ఈ కుష్టు వ్యవస్థకి మూల విరాట్టులు 
చీకటి బజారు జలగలని 
రాజకీయ బొద్దింకలని 
పదవీమదాదులని 
సాహిత్య వండి మాగధులని 
అభయ హస్తం తో కాపాడే కంకణం కట్టుకున్నారు 
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా 
కాలువల నిండా పారిస్తున్నారు 

అని నిరసించాడు . ఆ తరువాత ఎప్పుడో గజ్జెల మల్లారెడ్డి 
తెలుగునాట భక్తి రసం 
తెప్పలుగా పారుతోంది 
డ్రైనేజీ సకీమ్  లేక 
డేంజర్ గా మారుతోంది 
అన్నాడు . ఇన్నాళ్ల తరువాత మనం ఎక్కడ వున్నాము అని ప్రశ్నించుకుంటే డేరా బాబాల  గుడారాలను  బద్దలు కొట్టడానికి ఇంకా సంశయిస్తున్నాము .  హైదరాబాద్  లాల్  బహదూర్ స్టేడియాలలో , విజయవాడ పి డబ్ల్యు  గ్రౌండ్స్ లో వరంగల్ పోచమ్మ మైదాన్  లలో లక్ష దీపాలు వెలిగిస్తున్నాము . ఇంట్లో ఉండవలసిన మతాన్ని వీధిలోకి , హృదయం లో ఉండవలసిన భక్తిని సమూహం లోకి తీసుకునివచ్చి మత బానిసత్వం లోకి అలా అలా వెళ్లి పోతున్నాము . 
ఓ మహాత్మా 
ఓ మహర్షీ 
ఏదీ   సత్యం ?
ఏది అసత్యం ? 

2

దిగంబర కవిత్వం వెనకడుగు వేశాక  విరసం స్థాపన లో చురుకైన పాత్ర పోషించాడు చెరబండ రాజు . విరసం ఆవిర్భావం నుండి తాను  మరణించేవరకు ఎగ్జిక్యూటివ్ మెంబర్  గ ఉన్నాడు . విరసం నా చిరునామా అని ప్రకటించలేదు కానీ విరసం వెన్నంటే వున్నాడు . దిగంబర దిక్ లు కాక మరో ఏడు  కవితా సంపుటాలు ప్రచురించాడు . తాను  ఎవరికోసం రాస్తున్నాడో వారికి చేరువ కావాలి అంటే వచన కవిత్వం కంటే పాట  ప్రధానం అని భావించి పాట  వైపు  ప్రయాణం చేశాడు . 
సుబ్బారావు పాణిగ్రాహి  అడుగుజాడలలో తనదయిన ముద్ర వేశాడు . ఆ తరువాత గద్దర్ కలగలిశాడు 

కొండలు పగలేసినం 
బండలుగా చేసినం 
మా నెత్తురు కంకర గా 
ప్రాజెక్టులు కట్టినం 
శ్రమ ఎవడిదిరో 
సిరి ఎవడిదిరో 
ఈ పాట  గద్దర్ పాడుతుంటే గిరిపురం జంక్షన్ లో విని మైమరచి పోయానని వేగుంట ఒక చోట రాశాడు అభ్యుదయ కవితోద్యమం లో వెలుగు వెలిగిన కవి కిశోరాలు అంతా సినిమా రంగం వైపు మళ్ళి  సినిమా పాటలు రాసుకుంటునప్పుడు విప్లవ కవిత్వం పాటను తన ప్రాణం గా స్వీకరించడం లో చెరబండ రాజు పాత్ర ఎంతో వుంది . యుగకర్త అని చెప్పుకున్న శ్రీశ్రీ భాష మధ్యతరగతి గుమ్మం దాటనప్పుడు విప్లవకవిత్వం పాట ద్వారానే జనం లోకి వెళ్ళింది . చిరుగాలి సితారా వినిపించిన శివసాగర్ నరుడో  భాస్కరుడో , గద్దర్ సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో , విరసానికి కొత్త ఊపిరిని ఇచ్చాయి . 
  రాజ్యం తనను వ్యతిరేకించేవాళ్లను అదుపులో పెట్టడానికి ఉపయోగించే పోలీస్ వ్యవస్థ ను ఉద్దేశించి  చెరబండ రాజు రాసిన పాట  కూడా ఎంతో ప్రజాదరణ పొందటం తో పాటు రాజ్యం విభజించి పాలించు స్వభావాన్ని సరళం గా వివరిస్తుంది 

మాలోని మనిషివే  మా మనిషివి నీవు .
పొట్టకూటి కోసం నీవు పోలీసువైనావు 
ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరుల గుండెలకు 
తూటాలు గురిపెట్టినావేమి ?

అన్నన్నా ఆ బతుకు బతుకే కాదు 
కాటికి కాల్జాపి  కూర్చున్న కన్నోళ్లు 
రాళ్లు మోసే చిన్న తమ్ముళ్లు చెల్లెళ్ళు 
పేగు లెండుకుపోయి చచ్చిపోయినాగాని 
దేశానికే అసువులు అర్పించు సోదరుల 
గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి  ? 

రాజ్యం ప్రయోగించే పోలీస్ వ్యవస్థ లో ఆత్మపరిశీలనకు పాటను ఆయుధం గా చేసుకున్నాడు 
చెరబండరాజు ఇన్ని పాటలు ఇంత కవిత్వమూ రాయకపోయినా తరతరాలు పొద్దున్నే తలచుకోవలసిన మాట ఒకటి చెప్పాడు 

దేశమేదైతేనేమి 
మట్టి అంతా ఒక్కటే 
అమ్మ ఎవరైతేనేమి 
చనుబాల  తీపంతా ఒక్కటే 
దీన్ని మించిన విశ్వమానవ సౌభ్రాతృత్వం మనకు ఎక్కడైనా కనపడుతుందా ? 

మా ఇంటి అందాల చందమామా 
చీకట్లు చిరకాలముండవమ్మా 
జాలిగుండెల తల్లి చెంతనున్నాది 
చెరసాల లో తండ్రి క్షేమమన్నాది 
అంటూ సాగే గీతం రాసిన చెరబండరాజే 
అనారోగ్య బాధితున్నే 
అయితేనేం యోధున్నే 
పోరాటం నాకు డైరెక్షన్ 
పాట  నాకు ఆక్సిజెన్ 
అని కూడా అన్నాడు  
3

సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న  చెరబండ రాజును కాన్సర్  మహమ్మారి ఆవహించింది . 1971 లో పి డి  యాక్ట్ కింద అరెస్ట్ అయి 50 రోజులు జైలు లో వున్నాడు 1973 లో మరోసారి అరెస్ట్ అయి 37 రోజులు  జైలు లో వున్నాడు . సికింద్రాబాద్ కుట్ర కేసు నుండి బయట పడిన తరువాత కూడా రాజ్యం అతడిని వెంటాడటం మానలేదు  . తన పరిస్థితి మీద చెరబండరాజు ఒక కవిత లో 
 ఒకవేళ అవకాశం దొరికి అమాయకం గా నేను ఆకాశం వైపు 
తేరిపారా చూస్తే 
వాళ్ళు నా చూపు ఎంత దూరం సోకిందో అని ఆరా తీస్తారు 
నా అడుగుల కింద ఉన్న 
పాద ధూళి ని తీసి 
ప్రయోగశాల లో పరిశీలిస్తారు 
నా పాటల లో ఉన్న  శక్తిని కనుగొనడానికి 
అన్నాడు . 

రాజ్యం తో నిరంతరం పోరాడిన చెరబండ రాజు కాన్సర్  తో పోరాడలేక ఓడిపోయాడు 

4

అప్పుడెప్పడో శ్రీశ్రీ ని దూరంగా ఉండి  చూస్తున్న అజంతాను ఎవరో అడిగారట . ఎందుకలా దూరంగా వున్నారు . అని ఎవరో అడిగారట . అజంతా అప్పుడు " ఒరే  అబ్బాయి అగ్ని గోళాన్ని అరచేతిలో ఎంతసేపు పెట్టుకుంటాము " ? అని ప్రశ్నించాడు 
అవును శ్రీశ్రీ అభిమానించే చెరబండ రాజు 
అరచేతిలో అగ్ని కణం 

వంశీకృష్ణ 

9573427422

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి