31, జులై 2011, ఆదివారం

లైఫ్ ఈస్ బ్యూటిఫుల్

బలి దానం, ఆత్మ త్యాగం ఈ రెండు పదాలు ఎంత అందమైనవో, ఎంత ఉన్నతమైనవో , అంత రాక్షసమైనవి కూడా. మతం మత్తు మందు అని మార్క్స్ అన్నాడు కానీ ఆత్మత్యాగం, బలిదానం ఈ రెండు అంతకంటే మత్తు ను ఇచ్చేవి. ఒకసారి ఆ మత్తు కి అలవాటు పడితే మరిక ఏది రుచించదు. త్యాగం అంటే పెద్ద పెద్ద విషయాలే కావలసిన అవసరం లేదు.మృత్యువు అంటే మరణం మాత్రమె కాదు. అనుభవం లోకి రావాల్సి వుంది రాణి ప్రతిదీ మరణమే. అలాగే తను పొందవలసి ఉండి మరెవరి కోసమో, మరెందుకోసమో పొందకుండా మిగలాల్సి రావడం కూడా త్యాగమే.
ఇద్దరు పిల్లలు వున్న ఇంట్లో చిన్న పిల్లాడు కోసం పెద్దపిల్లడు వదులుకునే ఆట బొమ్మ నుండే త్యాగం మొదలవుతుంది. తనకు ఆడుకొవాలనుండి అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడు అనో , ఆట బొమ్మ ని త్యాగం చేసినప్పుడే పిల్లల మనసులో ఒక మత్తును అనుభవించడానికి బీజం పడుతుంది. అది పెరిగి పెద్ద అయి చివరకి జీవితాలనే త్యాగం చేసేంతవరకు వెళుతుంది. ఒక చిన్న, అతి సాధారణ విషయం నుండి, ఒక పెద్ద లాజిక్ ను నేను లాగుతున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ ఇది నిజం గా నిజం. అయితే ఇది త్యాగం అనీ, దీన్ని అనుభవించడంలో ఒక మత్తు వుందని, ఇది భవిష్యత్తులో ప్రమాదకారి అవుతుందని ఆ సమయం లో వాళ్లకి తెలియక పోవచ్చు.

జీవితం అందమైనది అని మనం నిజం గా భావిస్తే దాన్ని అంత సౌందర్యవంతం చేస్తున్న అంశాలేమిటో కూడా మనకు తెలిసి వుండాలి. తొలి ఉషోదయం, తులసి ఆకు మీద నిల్చిన తుహిన కిరణ సందోహం, అమ్మ చేతి గోరు ముద్దా, ప్రియురాలి లేలేత పెదవి ముద్ర, తొలి చూలు అనుభవం లోకి వచ్చినప్పుడు సహచరి కళ్ళలో కనిపించే ఒక మైమరపు,పుత్రగాత్ర పరిష్వంగం, కంటి పాప బోసి నవ్వు, చిట్టి చెల్లెలి చిలిపి అలక, సహజీవన సౌభాగ్యం కలిగించిన సహచరి హృదయం లో నిండి వుండే ప్రేమానుభూతి , ఆత్మీయ మిత్రుడి చిరంతన అభయం,ఇవన్నీ జీవితాన్ని సౌందర్య వంతం చేస్తాయి. వీటిలో ఏ ఒక్కటి అనుభవం లోకి రాకపోయినా ఆ జీవితం సంపూర్ణం కాదు. ఉత్త పూర్ణం .

ప్రతి జీవితానికి ఒక లక్ష్యం వుండాలి. ఒక సార్ధకత వుండాలి. నిజానికి ప్రతి ప్రాణీ ఈ భూమ్మీద ఏదో ఒక లక్ష్యాన్ని చేధించ డానికె శ్వాశ ను అందుకుంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే జీవితాన్ని నిండు నూరేళ్ళు అర్థ వంతం గా జీవించాలి. అర్థవంతం గా జీవించడమంటే మనలో చాలా మందికి అర్థం లేని విషయమే. మన దృష్టి ఎప్పుడు డబ్బు సంపాదించడం మీద , ఇల్లు కట్టుకోవడం మీద, బ్యాంకు లో డబ్బు జమ చేసుకోవడం మీద, పిల్లలకి కష్ట పడకుండా బోలెడంత డబ్బు సంపాదించి పెట్టి ఇవ్వడం మీద వుంటుంది తప్పిస్తే ఒక తాత్విక లక్ష్యం మీద ఉండదు.
శ్లేష్మం లో పడిన ఈగ లాగా కొట్టుకుపోవడం తప్పిస్తే, ఒక్క క్షణం ఆలోచించి జీవితాన్ని, దాని భౌతిక , ఆధ్యాత్మిక సౌందర్యాలని సమన్వయం చేసుకోవడం తెలియదు. అసలు ఆ వైపు గా ఆలోచనే మరలదు.

ఒక పసి పాప నవ్వుకు పరవశ మవడం , ఒక దుఖిత హ్రుదంతరంగానికి సహానుభూతి చెందటం, ఒక సజీవ మానవ స్పర్శ కి సానుకూలంగా స్పందించడం, ఒక సామూహిక సంగీత స్వర సమ్మేళనం లో శ్రుతి కావడం, ఇంత ఎందుకు, మానుషత్వం నిండిన మనిషిలా స్పందించటం ఇవాళ చాలామందికి తెలియదు. ఇందుకు ప్రధాన కారణం
మన జీవన దృక్పధం లోనే వుంది.

జీవితం పట్ల మన దృష్టి మారకుండా, మన సున్నిత సంస్పందనలు పెంచుకోకుండా, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అని మనం చెప్పలేము. జీవితం ఎప్పుడు అందమైనదే. దాన్ని నిండుగా జీవించడమే మనకు తెలియదు. అర్థం లేని, చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని దుఃఖ భాజనం చేసుకుంటాము. దుఖం లో మునిగి అదే సత్యం శివం సుందరం అనుకుంటాము. దుఖం వినా మరేది మనకు పట్టదు. జీవితానికి అవతలి వైపున ఏం వుందో తరచి, తరచి, చూడండి.అది మీకు స్వయం జ్వలిత తారకలా కనిపిస్తుంది. జీవితం ఒక్కటే. దాన్ని అనేక కారాగారాలలో బందీ చేయకండి.

ప్రేమ కోసమో, వుద్యోగం కోసమో, వుద్యమంకోసమో, ప్రాణాలని త్యాగం చేయకండి.నిజం లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ . లైఫ్ ఈస్ బ్యూటిఫుల్

24, జులై 2011, ఆదివారం

ఒక సర్వనామం గురించి .......

జీవితం చాలా విలువైనది. ఈ మాటను మనం చాలా సార్లు విని , రాసి, చదివి ఉంటాము. ఇప్పుడిలా కొత్తగా చెపుతున్నట్టు జీవితం చాలా విలువైనది అని రాస్తూ వుంటే నాకే నవ్వు వస్తోంది. కానీ జీవితాన్ని దాని నిండైన అర్థం తో, నిజమైన స్పూర్తితో మన స్వీకరించామా అంటే లేదు అనే జవాబు వస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలకే మనం జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాము. ప్రేమ విఫలమైంది అనో , పెళ్లి శకలమైంది అనో, మనసు వికలమైంది అనో, పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదు అనో, వచ్చిన మార్కులు సరిపోలేదు అనో , చివరాఖరికి అభిమానించే నటుడో, రాజకీయ నాయకుడో మరణించాడు అనో, అర్రెస్ట్ అయ్యాడు అనో జీవితాన్ని అర్థాంతరంగా ముగించే వాళ్లకు మన సమాజంలో కొదవ లేదు. ఎందుకని?

ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగిపోతున్న ధనిక పేద అంతరాలు, క్షణ క్షణం అభివృద్ధి చెందుతున్న సమస్యలు, విస్తరిస్తున్న పెఅజ్ త్రీ\ సెలబ్రిటి సంస్కృతి,ఈ ఆత్మ హత్యలకు కారణం అవుతున్నాయా?
జీవితాన్ని జీవించడము తెలియక, ముగించడము తెలియక ఇప్పటి తరం ఎందుకిలా మృత్యు గాత్ర పరిష్వంగం లో ఓదార్పు పొందుతున్నది? ఏ అనుభూతులకు, వాటి ఆనుభవిక సంస్పందనలకు నోచుకోకుండా , ఈ అందమైన ప్రపంచానికి మధ్యలోనే వీడ్కోలు పలికి రహస్య దారులవెంట , హడావిడి గా వెళ్ళిపోతున్నారు?

లోకం లో దుఖం వుంది నిజమే. దానితోపాటే ఆనందం కూడా వుంది. వేదన వున్నది నిజమే కానీ దాని వెనుక వేడుక కూడా వున్నది. ఒక పార్శ్వాన్ని చూసి, మరొక దానిని చూడ నిరాకరిస్తే అది ఈపాటికి సమ్యక్ దృష్టి అవదు. వెండి మబ్బుకు అమరితేనే జరీ అంచుకు విలువ వస్తుంది. దుఖం అనుభవం లోకి వస్తేనే కదా సుఖం సౌందర్యం ఏమిటో అవగతమయ్యేది. ఒక సమస్యలో కూరుకొని పోయి, దానితో పోరాడి, గెలిస్తేనే , సమస్య అంతులేని సుడిగుండాలు వున్న సముద్రం కాదని తెలిసేది.
ఇవాళ సమాజం మొత్తం గా ఒక ద్వంద్వం లో తనను తాను అన్వేషిస్తున్నది. ఒక పక్క చీమకు కూడా హాని తల పెట్టని సాదు స్వభావం, మరొక పక్క ప్రాణాలని మొక్కజొన్న పేలాలు ఎగిరినంత తేలికగా పైకి పంపించగల క్రూరత్వం నలువైపులా కనిపించి మనిషిని ఒక అంతులేని గందరగోళం లో కి నేట్టుతున్నదా? మనిషికి సర్వనామం మృత్యువు అవడానికి ఇవాళ కారణ భూతం అయిన వారు ఎవరు?

ఒక శ్రీకాంతా చారి, యాదయ్య, వేణుగోపాల రెడ్డి, ఇప్పుడు యాది రెడ్డి, పేరు ఏది ఐతేనేం? మృత్యువు తనను తాను విస్తరింప చేసుకోవడానికి వెతుక్కున్న వాహికలు వారు. వారి మరణం వెనుక వారి మానసిక బలహీనత ఎంత? ఉద్యమ తాత్వికత ఎంత? నేతల అసమర్ధ అవగాహనా రాహిత్య, స్వప్రయోజనకర రాజకీయ లౌల్యమెంత? ఇన్ని మరణాలని దాటి వచ్చిన తర్వాతా కూడా ఉద్యమ పంధా మారక పోతే రేపు ఎప్పుడో ఈ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి తరగ ఒకటి నిలదీసి మరీ ప్రశ్నిస్తుంది. ఆత్మసాక్షి ఎదురు తిరిగి మరీ శిక్షిస్తుంది.

తెలంగాణా వచ్చినా, రాకపోయినా, ప్రజలు కలసి వున్నా, విడిపోయినా, ఆత్మహత్యలు మరకలుగా ఉద్యమ ఆకాశం మీద మిగిలి పోక తప్పదు. యాది రెడ్డి తన ఉత్తరం లో కోరుకున్నట్టుగానే ఇది యముని మహిషపు లోహ ఘంటల ఆఖరి సవ్వడి కావాలి. చర్చలు చేసేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కలసివుండటం అనేది ఒక అందమైన స్వప్నం. సహజీవనం అనేది చాల సహనం తో, సంయమనంతో, ప్రజస్వ్యామ్య దృక్ఫదం తో, త్యాగ గుణం తో నిరంతరం కొనసాగించాల్సిన ఒక అందమైన ఒక అతి కష్టమైనా , జేవితాంతం కొనసాగించాల్సిన ప్రక్రియ. త్యాగం లేకుండా, సహనం, లేకుండా అన్నిటిని మించి సాటి మనిషి పట్ల ప్రేమ లేకుండా సహజీవనం సాధ్యపడదు కాక సాధ్యపడదు.

కలసి వుండాలి అనే వాళ్ళు ఇప్పుడిక ఏ ఏ త్యాగాలు చేస్తారో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. యధాతధ స్థితి కొనసాగించాలి అనుకుంటే అది సాగని పని. కేసి కెనాల్ మీద వున్న ఆర్ డి ఎస్ తూములని బద్దలుకొట్టి మరీ నీళ్ళు తరలించుకోకుండా ఉండగలరా? మూడో పంటకి నీళ్ళ కోసం పులిచింతల కోసం పట్టుపట్టకుండా పాలమూరు బీడు భూములలోకి క్రిష్ణమ్మని బిరా బిరా ప్రవహిమ్పచేయగాలరా? హైదరాబాద్ ఆరో జోను లో భాగమని వోప్పుకోగాలరా?భద్రాద్రి రాముడి పాదాలని ముద్దాడే పవనోత్తున్గా తరంగ గోదారి గంగ ఆ భద్రాద్రి రాముడినే జల సమాధి చేయగల పోలవరం ప్రాజెక్ట్ కి వీడ్కోలు పలికి ప్రత్యమ్నాయ ఆలోచన చేయగలరా?

ఏ త్యాగము చేయకుండా కలసి వుండాలని లాబీయింగ్ మాత్రమే చేయగలరా? తేల్చుకోవలసింది నేతలే. అందాక ఒకటే మాట " జీవితం విలువైనది దానిని ఆత్మహత్యలతో అర్థ రహితం చేయ వద్దు" తెలంగాణా రావచ్చు, రాక పోవచ్చు. అది మీ చేతుల్లో లేదు. కానీ మీ జీవితం మీ చేతుల్లోనే వుంది. దాని అనాధను చేయకండి.