3, మార్చి 2011, గురువారం

సంధ్యా సందర్భం

సంధ్యా సందర్భం

ఇన్ని పగల్లెందుకు? ఇన్ని రాత్రులెందుకు ? ఇన్ని దుఖాశ్రువులెందుకు? ఇన్ని చిర్నవ్వు విచ్చుకత్తులేందుకు? ఇన్ని మతాలెందుకు? ఇన్ని మమతానుబందాలెందుకు? ఇన్ని సంధ్యలెందుకు ? ఇన్ని సందర్భాలెందుకు? జారిపోయిన నీటి పడవలాంటి ప్రేమలెందుకు? పారిపోయిన శ్వేత వెన్నెల లాంటి ద్వేషా లెందుకు? రంగు మార్చిన రాతి చక్రం లాంటి వేదన లెందుకు? రాత్రి వేళ భయం భయం గా ఒదిగి పోయే పల్లె లాంటి పరిమళా లెందుకు? నవ్వలేని నక్షత్రాలెందుకు? కుంకుడు గిన్జల్లాంటి అనుభవా లెందుకు? వరద వచ్చి వెళ్ళాక , రైలు వచ్చి వెళ్ళాక ఆత్మ లేని శరీరం లా బోసి పోయే వరిపైరు లాంటి , ఐదో నెంబర్ ప్లాట్ఫారం లాంటి హృదయ శకలాలేందుకు? చీకటంతా రంగరించి ప్రియురాలి కంటి కాటుకలా చేసే భావుక హృదయ సంఘర్షణ లెందుకు? ఇరు సంధ్యల నడుమ నలిగి పోయే జీవితాలేందుకు? అసుర గీతమై పోయిన వికలాంగ భాష ఎందుకు? అక్షరాలు ఎందుకు? ఆకర్షణలు ఎందుకు? జాతుల మధ్య సంఘర్షణ లో జనించే ఉద్యమాలు ఎందుకు? మొండి చెట్టుకు పూలై పూచే వైఫల్యా లెందుకు? స్వరం తెగిన గొంతులో మూగ గీతాలు ఎందుకు? మోవి పైన చిగురించిన మాటల పువ్వు లెందుకు? వెన్ను పైన నిలువ లేని వక్తిత్వ చాయలు ఎందుకు? ఇన్ని సంధ్య లెందుకు? ఇన్ని సందర్భాలెందుకు? ఒక మనిషి మరొక మనిషి లో ప్రవహించడానికి ఇన్ని వైరుధ్యాలు ఎందుకు? ఇన్ని వైమనస్యాలు ఎందుకు? (వంశీ కృష్ణ పాత కవిత్వ సంపుటి డబ్బు పిట్ట నుండి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి